Share News

ఈ రోడ్డు బాగుపడదా?

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:04 AM

నర్సీపట్నం- తుని ప్రధాన రహదారిలో నర్సీపట్నం, నాతవరం మండలాల పరిధిలో రోడ్డు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. టెండర్‌ ప్రక్రియ పూర్తయి 11 నెలలు కావస్తున్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్‌ ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. నిబంధనల ప్రకారం కాంటాక్టర్‌పై చర్యలు తీసుకోవల్సిన ఆర్‌ఆండ్‌బీ అధికారులు... నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పైగా తారు ధర పెరిగిపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టలేదని చెబుతున్నారు.

ఈ రోడ్డు బాగుపడదా?
బలిఘట్టంలో అధ్వానంగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు

అధ్వానంగా నర్సీపట్నం- తుని ఆర్‌అండ్‌బీ రహదారి

ఏడాది క్రితం రూ.7.2 కోట్లు మంజూరు చేయించిన స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

గత డిసెంబరులో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

11 నెలలు దాటినా పనులు మొదలుపెట్టని కాంట్రాక్టర్‌

తారు ధర పెరిగిందన్న సాకు

నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్న అధికారులు

వర్షాలకు రహదారి మరింత ఛిద్రమై ఇబ్బంది పడుతున్న వాహనదారులు

నర్సీపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం- తుని ప్రధాన రహదారిలో నర్సీపట్నం, నాతవరం మండలాల పరిధిలో రోడ్డు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారాయి. టెండర్‌ ప్రక్రియ పూర్తయి 11 నెలలు కావస్తున్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్‌ ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. నిబంధనల ప్రకారం కాంటాక్టర్‌పై చర్యలు తీసుకోవల్సిన ఆర్‌ఆండ్‌బీ అధికారులు... నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పైగా తారు ధర పెరిగిపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టలేదని చెబుతున్నారు.

రోడ్లు, భవనాల శాఖ పరిధిలో వున్న నర్సీపట్నం- తుని ప్రధాన రహదారి జిల్లా రవాణా వ్యవస్థలో అత్యంత ముఖ్యమైంది. ఈ మార్గంలో అనకాపల్లి జిల్లాకు చెందిన నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు మండలాల ప్రజలు రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ వంటి ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాల రద్దీ నానాటికీ పెరిగిపోతుండడంతో నర్సీపట్నం ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ రోడ్డు అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. నర్సీపట్నంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద నుంచి నాతవరం మండలం శృంగవరం వరకు 17 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులకు ఏడాది క్రితం ప్రభుత్వం నుంచి రూ.7.2 కోట్లు మంజూరు చేయించారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన తరవాత అధికారులు గత ఏడాది డిసెంబరులో రోడ్డు నిర్మాణ పనులకు స్పీకర్‌తో భూమి పూజ చేయించారు. రహదారి అభివృద్ధి పనులు త్వరగా జరిగి, రవాణా కష్టాలు తీరతాయని ఆయా మండలాల ప్రజలు భావించారు. కానీ నెల.. రెండు నెలలు.. ఆరు నెలలు.. దాటినా కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించలేదు. టెండర్‌ అగ్రిమెంట్‌ ప్రకారం నెల రోజుల్లో పనులు మొదలు పెట్టకపోతే కాంటాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. కానీ ఆర్‌ఆండ్‌బీ అధికారులు నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైగా గల్ఫ్‌ యుద్ధం కారణంగా తారు రేట్లు పెరిగిపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టలేదని చెబుతున్నారు. టెండర్‌ నిబంధనల ప్రకారం రోడ్డు పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాత నిర్మాణ సామగ్రి ధరల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కాంట్రాక్టర్‌ పనులు చేపట్టాలి. ఆ విషయం ఆర్‌అండ్‌బీ అధికారులకు తెలియదా? అని జనం ప్రశ్నిస్తున్నారు.

పలుచోట్ల గోతులు.. వాహనదారుల అవస్థలు

నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం నుంచి నాతవరం మండలం శృంగవరం వరకు రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. ద్విచక్ర వాహనదారులు ఈ గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. నర్సీపట్నంలో శారదానగర్‌ నుంచి బలిఘట్టం ఊర్లోకి మలుపు తిరిగే కూడలి (టీ జంక్షన్‌)లో రహదారి పూర్తిగా ఛిద్రమైంది. ద్విచక్ర వాహనాలు మలుపు తిరగడానికి అవకాశం లేని విధంగా రోడ్డు పాడైంది. అక్కడ నుంచి బలిఘట్టం తలుపుమ్మ గుడి వరకు మరీ ఘోరంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బలిఘట్టం పెట్రోల్‌ బంకు సమీపంలో రోడ్డు మధ్యలో ఉన్న గొయ్యిలో నీరు చేరి చెరువుని తలపిస్తున్నది. బయపురెడ్డిపాలెం వంతెన దగ్గర, వేములపూడికి వెళ్లే కూడలిలో, నాతవరం మండలంలో ఎం.బెన్నవరం, ములగపూడి, డి.యర్రవరం గ్రామాల పరిధిలో పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. కాగా టెండర్‌ ప్రక్రియ ముగిసి 11 నెలలు అయినా రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టని వైనంపై ఆర్‌అండ్‌బీ ఏఈ నాయుడుని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా... తారు ధరలు పెరగడంతో కాంట్రాక్టర్‌ పనులు మొదలు పెట్టలేదని, త్వరలో పనులు మొదలుపెట్టేలా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.

Updated Date - Nov 07 , 2026 | 01:04 AM