Share News

ఖరీఫ్‌కు సాగునీరు అందేనా?

ABN , Publish Date - May 20 , 2026 | 11:30 PM

ఖరీఫ్‌ సాగుకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్నా సాగునీటి వనరులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈసారి కూడా సాగునీటికి కష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు.

ఖరీఫ్‌కు సాగునీరు అందేనా?
శిథిలమైన బూదరాళ్ల పంచాయతీలోని కన్నెముత్యాలు చెక్‌డ్యామ్‌

మండలంలో దెబ్బతిన్న సాగునీటి వనరులు

గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం

49 చెక్‌డ్యామ్‌లు, 47 చెరువులు, నాలుగు ఆనకట్టలు, రెండు రిజర్వాయర్ల మరమ్మతులకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు

నిధుల విడుదలలో జాప్యం

రైతుల్లో ఆందోళన

కొయ్యూరు, మే 20 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సాగుకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉన్నా సాగునీటి వనరులు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఈసారి కూడా సాగునీటికి కష్టాలు తప్పవని రైతులు వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి వనరులను పట్టించుకోలేదు. కాగా రెండు నెలల క్రితం చిన్నతరహా నీటిపారుదల శాఖ(ఎస్‌ఎంఐ) అధికారులు మండలంలోని 49 చెక్‌డ్యామ్‌లు, 47 చెరువులు, నాలుగు ఆనకట్టలు, రెండు రిజర్వాయర్ల మరమ్మతులకు రూ.15.44 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. దీంతో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో కూడా సాగునీరు అందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో 33 పంచాయతీల పరిధిలో సాగునీరందించేందుకు సుమారు 178 చెక్‌డ్యామ్‌లు, నాలుగు రిజర్వాయర్లు, సుమారు 150కు పైగా చెరువులు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 100కు పైగా చెక్‌డ్యామ్‌లు శిథిలావస్థకు చేరగా, మూడు రిజర్వాయర్లు, చెరువులు, ఆనకట్టల గట్లు శిథిలమయ్యాయి. కాలువలు మరమ్మతులకు నోచుకోక నీరు వృథాగా పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో కించెవానిపాలెం రిజర్వాయర్‌కు ప్రపంచ బ్యాంక్‌ నిధుల నుంచి రూ.75 లక్షలు, లుబ్బుర్తి రిజర్వాయర్‌కు రూ.49 లక్షలు మంజూరు చేసింది. వీటితో పనులు ప్రారంభించి కించెవానిపాలెం రిజర్వాయర్‌ 10 శాతం మేర పనులు నిర్వహించగా, లుబ్బుర్తి జలాశయం పనులు పూర్తి చేశారు. కాగా సుమారు 200 ఎకరాలకు సాగునీరందించే చుట్టుబంద పంచాయతీ తొణుకుల గెడ్డ రిజర్వాయర్‌ 2019లో వచ్చిన తుఫాన్‌కు కుడి, ఎడమ కాలువలు పూర్తిగా శిథిలమయ్యాయి. దీనిపై ప్రభుత్వానికి రూ.30 లక్షలతో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు చేయలేదు. సుమారు 600 ఎకరాలకు సాగునీరందించే గాంకొండ పెద్దగెడ్డపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ శిథిలమై నీరు వృథాగా పోతోంది. అలాగే కంపరేగుల దెయ్యాలగుమ్మి చెక్‌డ్యామ్‌, దోనెల చెక్‌డ్యామ్‌లు పూర్తిగా శిథిలమయ్యాయి. బొర్రంపేట, బకులూరు, మర్రివాడ, బూదరాళ్ల, యు.చీడిపాలెం, రేవళ్లు, కొయ్యూరు ఐటీడీఏ కాలనీకి సంబంధించిన చెక్‌డ్యామ్‌లు పూర్తిగా శిథిలమై సాగునీరందక గత నాలుగేళ్లుగా వందలాది ఎకరాలు బీడు భూమిగా మారాయి. గుడ్లపల్లి, మర్రివాడ, తాళ్లపాలెం, గదభపాలెం, చీడిపాలెం, కాట్రగెడ్డ, చిట్టింపాడు చెక్‌డ్యామ్‌లకు రెండు సంవత్సరాల క్రితం ఆయకట్టు రైతులు తాత్కాలికంగా మట్టి, రాళ్లు పేర్చి నెట్టుకొస్తున్నారు. ఖరీఫ్‌నకు మూడు నెలలే సమయం ఉండడం, చెక్‌డ్యామ్‌లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఎస్‌ఎంఐ జేఈ సీహెచ్‌ రామకృష్ణ వివరణ కోరగా, రెండు నెలల క్రితమే చెక్‌డ్యామ్‌లు, ఆనకట్టలు, రిజర్వాయర్ల మరమ్మతులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ నెలాఖరుకు అనుమతులతో పాటు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఖరీఫ్‌లో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Updated Date - May 20 , 2026 | 11:30 PM