Share News

నకిలీ ఉత్తర్వుల గుట్టు తేలేనా?

ABN , Publish Date - Feb 23 , 2026 | 01:05 AM

వైద్య, ఆరోగ్యశాఖలో నకిలీ నియామక ఉత్తర్వులు హల్‌చల్‌ చేస్తున్నాయి.

నకిలీ ఉత్తర్వుల గుట్టు తేలేనా?

- ఆరోగ్యశాఖలో ఫేక్‌ నియామక ఉత్తర్వుల హల్‌చల్‌

- పూర్వపు డీఎంహెచ్‌వోల పేర్లతో జారీ

- ప్రస్తుత అధికారి పేరుతోనూ కొందరికి ఆర్డర్లు

- మోసపోయిన పలువురు అభ్యర్థులు

- డీఎంహెచ్‌వో కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు

- పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులిపేసుకుంటున్న అధికారులు

- చెలరేగిపోతున్న అక్రమార్కులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి):

వైద్య, ఆరోగ్యశాఖలో నకిలీ నియామక ఉత్తర్వులు హల్‌చల్‌ చేస్తున్నాయి. పోస్టుల భర్తీ లేకుండానే కొంతమందిని నమ్మించి రూ.లక్షలు దోచేసి, పూర్వ అధికారుల పేరుతో దర్జాగా ఉత్తర్వులు ఇచ్చేస్తున్నారు. ఉద్యోగం వచ్చిందనే ఆనందంలో వాటిని తీసుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లిన అభ్యర్థులు అవి ఫేక్‌ అని తెలియడంతో మోసపోయామని గుర్తించి, డీఎంహెచ్‌వో కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇలాంటి అక్రమాలు వెలుగుచూసిన సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న అధికారులు ఆ తరువాత పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.

అమాయక అభ్యర్థులకు ఫేక్‌ ఉత్తర్వులు జారీచేసిన ఉదంతాలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చాయి. వీటిపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన ఆరోగ్యశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఏజెన్సీలోని ఆరోగ్య కేంద్రం క్రిటికల్‌ కేర్‌ విభాగంలో స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు ఇద్దరికి నియామక ఉత్తర్వులు అందాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లిన అభ్యర్థులకు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. నియామక ఉత్తర్వులు పరిశీలించిన అక్కడి అధికారులు ఈ తరహా పోస్టులు లేవని, ఉత్తర్వుల్లో సంతకం ఉన్న ఆరోగ్యశాఖ అధికారి ప్రస్తుతం ఇక్కడ లేరని చెప్పడంతో వారు కంగుతిన్నారు. వెంటనే విశాఖ ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి తమకు జరిగిన మోసాన్ని చెప్పి లబోదిబోమన్నారు. దీనిపై అప్పట్లో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది జరిగిన కొద్ది నెలలకే మరో కేసు వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లాలోని ఓ ఆరోగ్య కేంద్రంలో రెండు కేటగిరీలకు చెందిన ఉద్యోగాల పేరుతో ఇద్దరికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆస్పత్రికి వెళ్లిన వారికి ఇదే తరహా అనుభవం ఎదురయింది. నియామక ఉత్తర్వులు ఫేక్‌ అని, ఖాళీలను భర్తీచేసేందుకు నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదని చెప్పడంతో వారు ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చారు. దీంతో మళ్లీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు సందర్భాల్లో గతంలో పనిచేసిన ఆరోగ్య శాఖ అధికారుల పేర్లతోనే ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తరు వాత కొద్ది నెలలకు కేజీహెచ్‌లోనూ ఉద్యోగాలు కల్పించినట్టు ఇద్దరికి నకిలీ నియామక ఉత్తర్వులను అందించారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన వారిని సిబ్బంది వాకబు చేయగా మోసపోయినట్టు గుర్తించారు. వెంటనే ఆరోగ్యశాఖ అధికారుల వద్దకు పంపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో ప్రస్తుత డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.జగదీశ్వరరావు పేరు ఉంది. కానీ మరికొన్ని సంతకాల్లో తప్పిదాలున్నాయి. కేజీహెచ్‌ డీఎంఈ కంట్రోల్‌ ఆస్పత్రి. ఇక్కడ జరిగే నియామకాలకు ఆరోగ్యశాఖ అధికా రితో సంబంధం ఉండదు. కానీ మోసగాళ్లు ఇవేమీ పట్టించుకోకుండా ఉత్తర్వులు తయారుచేసి ఇచ్చేస్తున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ నియామక ఉత్తర్వులు వెలుగులోకి వస్తున్నప్పటికీ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు అభ్యర్థులు వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆ తరువాత విస్మరించడంతో మోసగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. పోస్టుల భర్తీ చేపట్టిన ప్రతిసారీ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. అడ్డగోలు వ్యవహారాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి మోసగాళ్లకు శిక్ష పడేలా చేయడంతోపాటు బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇలా మోసపోయిన కొందరు ఇప్పటికీ ఆరోగ్యశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు.

ఫార్మాసిస్టు పోస్టుల భర్తీకి కసరత్తు

విశాఖపట్నం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో ఖాళీగా ఉన్న 12 ఫార్మాసిస్టు పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు జోన్‌-1 పరిధిలో 583 మందికి దరఖాస్తు చేయగా, వాటిని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరుకు ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా సిద్ధమవుతుందని,ఆ తరువాత అభ్యంతరాలు స్వీకరించి తుది జాబితాను విడుదలచేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై ఆర్డీ డాక్టర్‌ రాధారాణి మాట్లాడుతూ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, దళారులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

Updated Date - Feb 23 , 2026 | 01:05 AM