Share News

తగ్గనున్న ప్రాథమిక పాఠశాలలు?

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:29 AM

విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిన ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

తగ్గనున్న ప్రాథమిక పాఠశాలలు?

ఐదుగురు విద్యార్థుల కంటే తక్కువ ఉంటే మూసివేత

జిల్లాలో 35 నుంచి 40 వరకూ ఉన్నట్టు అంచనా

వివరాల సేకరణలో అధికారులు

విశాఖపట్నం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి):

విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిన ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. తొలిదశలో ఐదుగురి కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలల (ఫౌండేషన్‌, బేసిక్‌)ను గుర్తించే పనిలో పడింది. జిల్లాలో ఐదుగురి కంటే తక్కువ మంది ఉన్న పాఠశాలలు 35 నుంచి 40 వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి నివేదిక రూపొందించి విద్యా శాఖకు పంపనున్నారు.

ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలల ఏర్పాటుకు సంబంధించి సంస్కరణలు తీసుకువచ్చారు. ఫౌండేషన్‌, బేసిక్‌, మోడల్‌, యూపీ, ఉన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ప్లస్‌ బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ప్లస్‌ మోడల్‌ ప్రాథమిక పాఠశాలలుగా విభజన చేశారు. సంస్కరణల ఫలితంగా ఫౌండేషన్‌ పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నారు. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు సమయంలో సమీపంలోని ప్రాథమిక పాఠశాలల నుంచి మూడు నుంచి ఐదు తరగతులను అక్కడకు తరలించారు. మరోవైపు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించే తల్లిదండ్రులు సంఖ్య పెరుగుతుంది. వీటన్నింటి ప్రభావంతో కొన్ని గ్రామాల్లో ప్రాఽథమిక పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతూ వచ్చింది. పద్మనాభం మండలం పెంట గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. అదే మండలం బర్లపేట, పెదగంట్యాడ మండలం మరడ దాసరిపేట, చినగదిలి ప్రభుత్వ బాలురు హోమ్‌ (జువెనైల్‌ హోమ్‌)లో ఒక్కొక్క విద్యార్థి మాత్రమే ఉన్నారు. మరడ దాసరిపేటలో గత ఏడాది ఉన్న విద్యార్థే కొనసాగుతుండగా ప్రస్తుత సంవత్సరంలో కొత్తగా ఎవరూ చేరలేదు. ఇద్దరు విద్యార్థులున్న పాఠశాలలు ఆరు ఉండగా, ముగ్గురు ఉన్నవి ఏడు ఉన్నాయి. ఐదుగురి కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను ఈ ఏడాదే మూసివేసి అక్కడ చదివే పిల్లలను సమీపంలోని పాఠశాలలకు పంపుతారా? లేదా ప్రస్తుత విద్యా సంవత్సరం ముగిసేంత వరకూ కొనసాగించి...జూన్‌ తరువాత మూసివేస్తారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల చేరికలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అప్రమత్తం కావాలని, తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

Updated Date - Jan 02 , 2026 | 12:29 AM