మెట్రో రైలు పట్టాలెక్కేనా?
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:34 AM
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు.
రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ప్రకటన
పుష్కరకాలం గడిచిపోయింది
ఇప్పటివరకూ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వని కేంద్రం
ఇంకా డీపీఆర్‌ల దశలోనే...
పరిశీలన పేరుతో జాప్యం
పెరిగిపోతున్న అంచనా వ్యయం
అటు మెట్రో లేక, ఇటు ఫ్లైఓవర్లు నిర్మించకపోవడంతో నగరవాసుల ఇబ్బందులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. కేంద్రం అనుమతి కోసం కూటమి ప్రభుత్వం వేచి చూస్తోంది. ఇదిగో...అదిగో అంటూనే రెండున్నరేళ్లు గడిచిపోయాయి. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా విశాఖపట్నానికి మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరైంది. పుష్కరం పూర్తయింది. కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఈ పన్నెండేళ్లలో మూడు డీపీఆర్‌లు తయారుచేశారు. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ గత ఏడాది విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచింది. ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ముందు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మించాలని అనుకున్నారు. ఆ తరువాత పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) అని ప్రకటించారు. ఎక్కువ సంస్థలు ముందుకు రాకపోవడంతో మళ్లీ రుణం అంటున్నారు. జాప్యం వల్ల ప్రాజెక్టు వ్యయం అనూహ్యంగా పెరిగిపోతోంది. అప్పట్లో రూ.11 వేల కోట్ల ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.14 వేల కోట్లకు చేరింది.
దేశంలో అత్యధిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సాధించే తొలి పది నగరాల్లో విశాఖపట్నం ఒకటి. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు ఆరు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. దీనిని మరింత పెంచడానికి నీతి ఆయోగ్ విశాఖపట్నం కేంద్రంగా ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి నడుం కట్టింది. అటువంటి నగరానికి తప్పనిసరిగా మెట్రో రైలు ప్రాజెక్టు ఉండాలి. కానీ డీపీఆర్‌లో లోపాలో, మరేమిటో కారణం తెలియదు గానీ ఢిల్లీలో కొర్రీలు వేసి ఆపుతున్నారు. దేశంలో సుమారు 21 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్కత్తా వంటి ప్రధాన నగరాల్లోనే కాకుండా కోచి, నాగపూర్, జైపూర్, ఆగ్రా, సూరత్, అహ్మదాబాద్ వంటి నగరాల్లోను మెట్రో రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో రెండు అంతకంటే ఎక్కువ నగరాల్లో మెట్రో రైళ్ల సౌకర్యం అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నంతో పాటు విజయవాడలోను మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్‌లు సమర్పించారు. ఇప్పటివరకూ ఒక్క దానికీ అనుమతి లభించలేదు.
కొమ్మాదికే ఆపసోపాలు..
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే వారి కోసం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. స్టీల్ ప్లాంటు నుంచి అటు భోగాపురం వరకు దీనిని నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మార్గం పొడవు సుమారుగా 76.9 కి.మీ. దీనిని దశల వారీగా చేపడతామని ప్రకటించారు. తొలి దశలో ముందుగా స్టీల్ ప్లాంటు నుంచి కొమ్మాది వరకు (34.2 కిలోమీటర్లు), నగరంలో గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు (5.1. కి.మీ), తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.7 కి.మీ) నిర్మించాలనేది ప్రతిపాదన. ఈ ప్రాజెక్టుకే ఇప్పటివరకూ కేంద్రం నుంచి అనుమతి రాలేదు. ఇక రెండో దశలో చేపట్టే కొమ్మాది-భోగాపురం సంగతి ఏమినేది చెప్పలేని పరిస్థితి.
తొలి దశ పనులు ప్రారంభిస్తే పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది. ఆ తరువాత రెండో దశలో భోగాపురం విమానాశ్రయానికి పనులు ప్రారంభిస్తారు. అది పూర్తి కావడానికి మరో ఐదేళ్లు పడుతుంది. అంటే ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి వెళ్లడానికి ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు సాఫీగా వెళ్లాలంటే...ఇంకో పదేళ్లు వేచి ఉండక తప్పదు.
విశాఖ జనాభాను, వాహనాలను, ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని రాబోయే 50 ఏళ్ల అవసరాలకు సరిపడేలా మంజూరైన 12 ఫ్లై ఓవర్లను రద్దుచేసి ఆ స్థానంలో డబుల్ డెక్కర్ నిర్మాణానికి నడుం కట్టిన ప్రజాప్రతినిధుల కార్యాచరణ ఎంత వరకు సఫలం అవుతుందో...ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.