Share News

చిక్కులు వీడేనా.. ‘సర్‌’!

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:08 AM

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) అమల్లో ఎదురవుతున్న చిక్కుల పరిష్కరణ జిల్లా యంత్రాంగానికి సవాల్‌గా మారింది. జిల్లాలో 20.23 లక్షల ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్‌ ఫారాలను శతశాతం డిజిటలైజేషన్‌ చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే వీటిలో 90 శాతం ఫారాలను ఓటర్ల నుంచి బీఎల్‌వోలకు అందాయి.

చిక్కులు వీడేనా.. ‘సర్‌’!

ఇప్పటికీ మ్యాపింగ్‌ కాని 1.5 లక్షల ఓటర్లు

4.5 లక్షల ఓటర్ల వివరాల్లో తప్పులు

రెండు లక్షల ఓటర్ల నుంచి వెనక్కిరాని ఫారాలు

నేవీ ప్రాంతాల్లో ఫారాల సేకరణకు ఇబ్బందులు

విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) అమల్లో ఎదురవుతున్న చిక్కుల పరిష్కరణ జిల్లా యంత్రాంగానికి సవాల్‌గా మారింది. జిల్లాలో 20.23 లక్షల ఓటర్ల నుంచి ఎన్యుమరేషన్‌ ఫారాలను శతశాతం డిజిటలైజేషన్‌ చేశామని అధికారులు చెబుతున్నారు. అయితే వీటిలో 90 శాతం ఫారాలను ఓటర్ల నుంచి బీఎల్‌వోలకు అందాయి. మిగిలిన పదిశాతంలో వలసవెళ్లిన వారు 1.35 లక్షలు మంది, డూప్లికేట్‌ ఓటర్లు 15వేల మంది, చనిపోయిన ఓటర్లు సుమారు 40 వేల మంది, బీఎల్‌వోలు వెళ్లినపుడు ఇళ్ల వద్దలేని ఓటర్లు పదివేల మంది ఉన్నారు. వీరి ఫారాలు అందలేదని పేర్కొంటూనే ఆ విషయాలను ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రస్తావించనున్నారు. అనంతరం వారిని తొలగిస్తారని సమాచారం. వలసవెళ్లిన వారి విషయంలోనూ అనేక సందేహాలున్నాయి. తూర్పు నావికాదళం, దాని అనుబంధ సంస్థలు, కేంద్ర ప్రభుత్వశాఖల్లో పనిచేసే ఉద్యోగులు నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరి ఓట్లు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ఆరు పొలింగ్‌బూత్‌లలో ఉన్నాయి. సుమారు ఐదువేల ఓటర్లుండగా వారి నుంచి 40 శాతం ఫారాలు వెనక్కి రాలేదు. సాధారణంగా వీరంతా సర్వీస్‌ ఓటర్లుగా నమోదుకావచ్చు. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారిలో ఎక్కువమంది ఎన్యుమరేషన్‌ ఫారాలు తిరిగి ఇవ్వలేదు. రెండుచోట్ల ఓటు ఉండకూడదన్న ఎన్నికల సంఘం నిబంధనతో ఎక్కువమంది వలసదారులు నగరంలో ఓటున్నప్పటికీ ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇవ్వలేదని సమాచారం. ఈ ఏడాదిలో జరగనున్న పంచాయతీ ఎన్నికల కోసం పొరుగుజిల్లాలకు చెందిన వారంతా అక్కడే ఓటర్లుగా కొనసాగేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

మ్యాపింగ్‌కు దూరంగా..

ఇదిలావుండగా బీఎల్‌వోలకు ఫారాలు అందించిన వాటిలో 1.5 లక్షల ఓటర్లు మ్యాపింగ్‌ జరగలేదు. 2002 ఓటరు జాబితాలో ఉన్న వివరాలను ప్రస్తుతం ఎన్యుమరేషన్‌ ఫారంలో ప్రస్తావించకపోవడంతో మ్యాపింగ్‌కు సమస్య ఎదురయింది. అవసరమైన డాక్యుమెంట్లు కూడా ఇవ్వలేదు. ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపుకార్డులలో ఒకటి సమర్పించాలి. వీరి విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. సర్‌ గడువు ఈనెల 24తో ముగియనున్నందున మ్యాపింగ్‌ చేయాల్సిన సంఖ్యను గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు. దీనిపైనే బీఎల్‌వోలకు పదే పదే సూచనలు చేస్తున్న అధికారులు, రాజకీయపార్టీల సహకారం తీసుకుంటున్నారు.

కాగా డిజిటలైజేషన్‌ చేసిన ఫారాల్లో సుమారు నాలుగులక్షల మంది ఓటర్లు పేర్కొన్న వివరాల్లో తప్పులు దొర్లినట్లు తెలిసింది. అంటే 2002 జాబితా, 2025 జాబితా మధ్య పేరు, ఇంటిపేరు, వయసు, ఇతర వివరాల్లో తేడాలున్నట్టు గుర్తించారు. చిన్నచిన్న తప్పులైనా వాటిని తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి బీఎల్‌వోలకు ఆదేశాలిచ్చారు. ఎక్కువగా భీమిలి నియోజకవర్గంలో తప్పులున్నట్టు గుర్తించారు. మధురవాడ పరిధిలోని పెద్ద అపార్టుమెంట్లలో ఓటర్లు అన్ని వివరాలు సమర్పించడంలేదు. ఈ నేపథ్యంలో నాలుగు లక్షలమందికి నోటీసులు జారీచేయనున్నారు. వీరిలో ఎక్కువమందికి ఇచ్చిన ఫారాల్లో తప్పులు ఉన్నందున వాటిని సవరించే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. గడువులోగా సవరణలు చేయకపోతే ముసాయిదా ఓటరు జాబితా విడుదల అనంతరం అభ్యంతరాల స్వీకరణ సమయంలో వివరాలు తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నారు.

Updated Date - Jul 20 , 2026 | 01:08 AM