Share News

కాలిబాట వంతెన పూర్తయ్యేదెన్నడో?

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:26 PM

మండలంలోని గవరపేట ప్రాంత రైతులకు శారదానదిపై కాలిబాట వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులు ప్రారంభించినా నిధులు విడుదలకాక అర్ధంతరంగా నిలిచిపోయాయి.

కాలిబాట వంతెన పూర్తయ్యేదెన్నడో?
కశింకోట గవరపేటలో శారదానదిపై దోనెలో ప్రయాణిస్తున్న రైతులు

గత వైసీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభం

నిధులు విడుదల చేయకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్‌

కూటమి ప్రభుత్వంలోనైనా మోక్షం కలుగుతుందా? అని రైతుల ఎదురుచూపులు

కశింకోట, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గవరపేట ప్రాంత రైతులకు శారదానదిపై కాలిబాట వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. గత వైసీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణ పనులు ప్రారంభించినా నిధులు విడుదలకాక అర్ధంతరంగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి పనుల్లో కదలిక లేదు. కూటమి ప్రభుత్వంలోనైనా వంతెన నిర్మాణం జరుగుతుందా? అని ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.

శారదానది అవతలి వైపు గవరపేటకు చెందిన రైతుల వందలాది ఎకరాల భూములు, పాడి ఉన్నాయి. వీరంతా శతాబ్ద కాలంగా తాటిదోనె సహాయంతో నిత్యం పొలాలకు వెళుతున్నారు. ఏడాదిలో 8 నెలల పాటు శారదానదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. ప్రాణాలకు తెగించి వీరంతా దోనెలో నది దాటుతున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించుకోవడంతో గత టీడీపీ ప్రభుత్వంలో అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. అనుమతి వచ్చేలోగా ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిపోయింది. 2020 జనవరి 9న గత వైసీపీ ప్రభుత్వం రూ.3 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించడంతో అప్పటి ఆ పార్టీ ఎమ్మెల్యే వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత రూ.50 లక్షలు విడుదల చేయడంతో టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. అయితే వంతెనకు 16 పిల్లర్లకు బదులు 11 మాత్రమే కొంత మేర నిర్మించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పనులను నిలిపివేశారు. అప్పటి నుంచి పనుల్లో కదలిక లేదు. కూటమి ప్రభుత్వంలోనైనా పనులు పూర్తి చేస్తారేమోనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:26 PM