Share News

బీఈడీ ప్రవేశాలపై దృష్టి సారించేనా?

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:51 AM

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో కాలేజీలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

బీఈడీ ప్రవేశాలపై దృష్టి సారించేనా?

చేరుతున్న వారిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులే అధికం

కాలేజీలకు రాకుండానే మేనేజ్‌ చేసుకునేలా ఒప్పందాలు

ఈ తరహా ప్రవేశాలకు అడ్డుకట్ట వేయాలంటున్న నిపుణులు

విశాఖపట్నం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి):

బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో కాలేజీలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గత కొన్నాళ్లుగా ఏయూ పరిధిలోని అనేక బీఈడీ కాలేజీల్లో ఇష్టారాజ్యంగా ప్రవేశా లను సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ప్రవేశాలు కల్పించడం, కాలేజీలకు హాజరుకాకుండానే కోర్సులు పూర్తి చేసే అవకాశాన్ని అనేక కాలేజీ యాజమాన్యాలు కల్పిస్తుండడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.

భావితరాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులను తీర్చిదిద్దే కోర్సుల్లో అడ్డగోలుగా ప్రవేశాలను కల్పిస్తుండడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆయా కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడం, పరీక్షల సమయంలో మాత్రమే హాజరయ్యేలా అవకాశాలు కల్పించడం ద్వారా అనేక కళాశాలల యాజమాన్యాలు భారీగానే ఆర్జిస్తున్నాయి. గతంలో ఈ తరహాలో వ్యవహరించిన కాలేజీలపై ఏయూ అధికారులు కఠినంగానే వ్యవహరించారు. నగర పరిధిలోని ఒక బీఈడీ కాలేజీలో ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ తనిఖీలకు వెళ్లిన సమయంలో ప్రవేశాల సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులు లేకపోవడంతో సీరియస్‌ అయ్యారు. సదరు కాలేజీపై అప్పట్లో అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా ఇలా అడ్డగోలుగా ప్రవేశాలు కల్పించి, డబ్బు చేసుకుంటున్న కాలేజీల సంఖ్య భారీగానే ఉందనే ఆరోపణలున్నాయి. అటువంటి తప్పిదాలు జరగకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రవేశాలపై అధికారులు దృష్టి సారించి, పకడ్బందీగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.

ఫీజుల కట్టడి అవసరం..

బీఈడీ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలి. అయితే, అనేక కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అదనపు ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఈ తరహా వసూళ్లకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అలాగే, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు సంబంధించి ఫీజులు కూడా భారీగానే వసూలు చేస్తున్నారు. ఒక్కో సీటుకు కొన్ని కాలేజీలు లక్షకుపైగానే వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలోనే అనేక కాలేజీలు ఈ తరహాలోనే ఫీజులు వసూలు చేశాయి. అయినప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ ఏడాది అయినా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు భారీ ఫీజులు వసూలు చేసే చర్యలకు అడ్డుకట్ట వేయాలని పలువురు పేర్కొంటున్నారు.

చెక్‌ చెప్పేలా..

వర్సిటీ పరిధిలోని అనేక కాలేజీల యాజమాన్యాలు గతంలో కౌన్సెలింగ్‌ ద్వారా చేరిన విద్యార్థుల నుంచి భారీగానే ఫీజులు వసూలు చేశాయి. ఇటువంటి వసూళ్లకు బ్రేక్‌ వేసేలా వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తే ఫిర్యాదులకు అవకాశం ఇవ్వాలని, అటువంటి కాలేజీలపై కఠినంగా వ్యవహరించేలా చూడాలని పలువురు విద్యార్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:51 AM