తాగునీటి కష్టాలు తీరేనా?
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:21 AM
ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఏజెన్సీలోని గిరి పల్లెల్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. జల్ జీవన్ మిషన్ పనులను ఎప్పటిలాగా కాకుండా ప్యాకేజీగా ఒకే సంస్థకు కట్టబెట్టాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో సమస్యలు
తాజాగా జల్ జీవన్ మిషన్ కింద 373 పనులు మంజూరు
రూ.55.89 కోట్లు కేటాయింపు
ఒకే సంస్థకు ప్యాకేజీగా అప్పగించేందుకు అధికారుల సన్నాహాలు
దీని వల్ల సకాలంలో పనులు పూర్తి కావని, ఇది విఫల ప్రయత్నమని పలువురి వాదన
కమీషన్ల కోసమే ఈ ఎత్తుగడ అని ఆరోపణలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఏజెన్సీలోని గిరి పల్లెల్లో నీటి కష్టాలు తప్పేలా లేవు. జల్ జీవన్ మిషన్ పనులను ఎప్పటిలాగా కాకుండా ప్యాకేజీగా ఒకే సంస్థకు కట్టబెట్టాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని వలన పనులు సకాలంలో పూర్తికావనే వాదనలు వినిపిస్తున్నాయి. కమీషన్ల కోసమే అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గతేడాది ఏజెన్సీలో జల్ జీవన్ మిషన్‌కు సంబంధించి సుమారు 1,550 పనులను రద్దు చేసి, వాటి స్థానంలో రూ.1500 కోట్ల వ్యయంతో జోలాపుట్టు రిజర్వాయర్ ఆధారంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి గిరిజన పల్లెలకు తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులు భావించారు. అయితే ఏజెన్సీలోని భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో వాటర్ గ్రిడ్ విధానం అమలు వీలుకాదని సూచిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో ప్రత్యేక కథనం ప్రచురితం కావడంతో పలువురు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలను ప్రభుత్వం రద్దు చేసింది. కాగా తాజాగా ఈ ఏడాది మార్చి నెలలో జల్ జీవన్ మిషన్‌లో భాగంగా మరో విడతగా 373 పనులు చేపట్టేందుకు రూ.55 కోట్ల 89 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఆయా పనులను ఎప్పటి వలే కాకుండా ప్యాకేజీగా నిర్మాణ పనులు చేపట్టేందుకు ఉన్నతాధికారులు చాపకింద నీరులా చర్యలు చేపడుతున్నారు. ఈ తతంగం వెనుక కమీషన్ల వ్యవహారమే కారణమని ఆర్‌డబ్ల్యూఎస్‌లో కింది స్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు.
ప్యాకేజీగా పనులతో ఏజెన్సీలో అనేక ఇబ్బందులు
ఏజెన్సీలోని పల్లెలు కొండకోనల్లో ఉండడంతో పాటు ఒక్కో గ్రామానికి దూరం సైతం ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో మైదాన ప్రాంతంలో వలే ప్యాకేజీగా తాగునీటి పథకాల పనులు చేపట్టడడం సాధ్యం కాదు. పైగా ప్యాకేజీలో భాగంగా ఎక్కువ పనులు ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తే సకాలంలో పనులు జరగని పరిస్థితి ఉంటుంది. ఏజెన్సీలో ఈ సమస్యను గుర్తించే గత కలెక్టర్ సుమిత్‌కుమార్ జల్ జీవన్ మిషన్‌కు సంబంధించిన పనుల విషయంలో నిబంధనలు పెట్టారు. ఒక కాంట్రాక్టర్‌కు కేవలం ఐదు పనులు మాత్రమే ఇవ్వాలని, వాటిని పూర్తి చేసిన తర్వాత మరో ఐదు పనులు ఇవ్వాలని ఆదేశించారు. ఒకే కాంట్రాక్టర్‌కు ఎక్కువ పనులు అప్పగించడంతో అడ్వాన్సు నిధులు తీసుకుని పనులు చేపట్టకపోవడం, ఎక్కువ పనులుండడంతో మందకొడిగా పనులు పూర్తి చేయడం వంటి సమస్యలుంటాయని ఆయన గుర్తించారు. దీంతో అదే నిబంధనను జిల్లాలో అమలు చేస్తున్నారు. అయితే కొత్తగా ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,814 కోట్ల వ్యయంతో 3 వేల పనులు మంజూరయ్యాయి. వాటన్నింటికీ ప్యాకేజీగా ఒకే సంస్థకు అప్పగించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అదే జరిగితే పనులు పూర్తికాకుండా గ్రామాల్లో తాగునీటి సమస్యలు మరింతగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. కాగా ప్యాకేజీగా పనులు చేయించాలనే అధికారుల ఆలోచనలతో గ్రామాల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లు భృతిని కోల్పోతారని ఆందోళన చెందుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో పాత పద్ధతిలోనే జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టాలనే వాదన బలంగా వినిపిస్తున్నది. అలా కాకుంటే అధికారుల అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తే గతంలో ప్రవేఽశపెట్టిన బహుళ ప్రయోజన తాగునీటి పథకాల వల్లే మూలకు చేరి ప్రజల దాహం కేకలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాకు తాజాగా తాగునీటి పథకాలకు మంజూరైన నిధుల వివరాలు
----------------------------------------------------------------------------------
వ.సం మండలం పనులు మంజూరైన నిధులు(రూ.లక్షల్లో)
1. అనంతగిరి 16 305.25
2. అరకులోయ 6 156.96
3. డుంబ్రిగుడ 115 1,979.10
4. హుకుంపేట 5 90.00
5. ముంచంగిపుట్టు 65 1,511.26
6. పెదబయలు 7 130.51
7. చింతపల్లి 5 48.50
8. జీకేవీధి 18 247.70
9. జి.మాడుగుల 76 801.80
10. కొయ్యూరు 9 248.41
11. పాడేరు 51 591.55
-------------------------------------------------------------------------------
మొత్తం 373 5589.52
--------------------------------------------------------------------------------