Share News

కరెంట్‌ కష్టాలు తీరేదెన్నడో?

ABN , Publish Date - May 29 , 2026 | 10:35 PM

చింతపల్లి, జీకే వీధి మండలాల్లోని గిరిజనులకు విద్యుత్‌ కష్టాలు తీరడం లేదు. గాలి వీచినా.. వానొచ్చినా.. 650 గిరిజన గ్రామాల్లో అంధకారం రాజ్యమేలుతోంది. చిన్న సాంకేతిక సమస్య ఏర్పడినా గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీలేరు నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌ వేసేందుకు రూ.ఏడు కోట్లు విడుదల చేసింది. అప్పటి నుంచి అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో కార్యరూపం దాల్చలేదు.

కరెంట్‌ కష్టాలు తీరేదెన్నడో?
చింతపల్లి 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌

గాలివీచినా..వానొచ్చినా చీకట్లోనే 650 గిరిజన గ్రామాలు

ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌కి కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

రూ.7 కోట్లు విడుదల

ఏడాదిన్నరగా మంజూరు కాని అటవీ అనుమతులు

చింతపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఉన్న 650 గిరిజన గ్రామాలకు బలిఘట్టం 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా జరుగుతున్నది. బలిఘట్టంలో ఏ సాంకేతిక సమస్య వచ్చినా చింతపల్లి, జీకేవీధి మండలాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. ఆ సమస్య పరిష్కరించే వరకు రెండు మండలాలకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గం లేదు. దీంతో ఆదివాసీలు అంధకారంలో జీవించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్యను గిరిజనులు అధికంగా ఎదుర్కొంటున్నారు. వర్షాలతో చెట్లు కొమ్మలు విరిగిపడడం, పిడుగులు పడి ఇన్సులేటర్లు పగిలిపోవడం, విద్యుత్‌ తీగలు తెగిపోవడం వంటి సమస్యలతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం జరుగుతుంది. విద్యుత్‌ శాఖ సిబ్బంది ఈ సమస్యను పరిష్కరించే వరకు చింతపల్లి, జీకేవీధి మండలాలు చీకటిలో ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.

ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌కి రూ.ఏడు కోట్లు

విద్యుత్‌ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీలేరు నుంచి ప్రత్యామ్నాయ 33 కేవీ విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చింతపల్లి నుంచి దుప్పిలవాడ వరకు ఇప్పటికే 33 కేవీ విద్యుత్‌ లైన్‌ ఉంది. సీలేరు నుంచి దుప్పిలవాడ వరకు తొమ్మిది కిలోమీటర్లు విద్యుత్‌ లైన్‌ నిర్మాణం చేపడితే సరిపోతుంది. ఈ మేరకు 2024 సెప్టెంబరు 8వ తేదీన కురిసిన అధిక వర్షాల సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఈపీడీసీఎల్‌ సీఎండీ సీలేరు నుంచి ప్రత్యామ్నాయంగా చింతపల్లికి విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోద ముద్ర వేశారు. ఇందుకు రూ.ఏడు కోట్లను ప్రభుత్వం 2024 నవంబరులో విడుదల చేసింది.

మంజూరు కాని అటవీ శాఖ అనుమతులు

సీలేరు నుంచి దుప్పిలవాడ వరకు 33 కేవీ విద్యుత్‌లైన్‌ రిజర్వుడ్‌ ఫారెస్టులో వేయాల్సి ఉంది. సుమారు 20 ఏళ్ల క్రితం సీలేరు నుంచి దుప్పిలవాడ వరకు విద్యుత్‌లైన్‌ నిర్మించారు. అయితే వినియోగించకపోవడంతో ఈ లైన్‌ పాడైపోయింది. అప్పట్లో విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి ఈపీడీసీఎల్‌ అధికారులు అటవీ శాఖ అనుమతులు తీసుకున్నారు. తాజాగా నూతన విద్యుత్‌ లైన్‌ నిర్మాణానికి పాత అనుమతులను పునర్‌ పరిశీలించి కొత్త అనుమతులు మంజూరు చేయాల్సి ఉంది. ఇందుకోసం చింతపల్లి అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించి, అమరావతి ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టుకి ప్రతిపాదనలు 2024 నవంబరు ఆఖరిలో పంపించారు. ప్రతిపాదనలు పంపించి ఏడాదిన్నర గడిచినా అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌కి అనుమతులు మంజూరు చేయలేదు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ విషయమై అటవీ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్‌కి అవసరమైన నిధులు విడుదల చేసినప్పటికీ పనులు ప్రారంభించే పరిస్థితి లేక ఆదివాసీలకు విద్యుత్‌ కష్టాలు తీరడంలేదు.

Updated Date - May 29 , 2026 | 10:35 PM