Share News

బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణం ప్రారంభమయ్యేనా?

ABN , Publish Date - Mar 10 , 2026 | 11:09 PM

అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో బ్లడ్‌బ్యాంకును తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో ఈ ప్రాంతవాసులు ఎంతో ఆనందపడ్డారు.

బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణం ప్రారంభమయ్యేనా?
ఇప్పటికీ శంకుస్థాపన నాటి గొయ్యి దర్శనమిస్తున్న దృశ్యం

శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటినా మొదలుకాని పనులు

డిప్యూటీ సీఎం సొంత నిధులతో నిర్మిస్తానని ప్రకటించినా కదలిక శూన్యం

అరకులోయ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో బ్లడ్‌బ్యాంకును తన సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ప్రకటించడంతో ఈ ప్రాంతవాసులు ఎంతో ఆనందపడ్డారు. బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణానికి ఈ ఏడాది జనవరి 8న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ శంకుస్థాపన చేయడంతో తమ కష్టాలు తీరాయని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ పనులు ప్రారంభంకాకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

రక్తహీనతతో బాధపడుతున్న గిరిజనుల కష్టాలను చూసి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చలించిపోయారు. ఈ ప్రాంతంలో బ్లడ్‌బ్యాంకు అవసరమని గుర్తించి అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో భవన నిర్మాణానికి తన సొంత నిధులు రూ.95 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 8న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, వైద్య విధాన పరిషత్‌ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అయితే శంకుస్థాపన చేసి రెండు నెలలు దాటినా పనులు ప్రారంభంకాలేదు. ఇప్పటికీ శంకుస్థాపన చేసిన గొయ్యే దర్శనమిస్తోంది. ఈ విషయంపై స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామును వివరణ కోరగా ఈ భవన నిర్మాణ పనులకు సంబంధించి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ) అధికారులు బ్లూప్రింట్‌ను ప్రభుత్వానికి పంపారన్నారు. అక్కడ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్‌ పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని జనసేన నేత గంగులయ్య వద్ద ప్రస్తావించగా ఏపీ ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌, కలెక్టర్‌ దృష్టికి దీనిని తీసుకువెళతానని తెలిపారు. కాగా బ్లడ్‌బ్యాంకు భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Mar 10 , 2026 | 11:09 PM