పీఎం జన్‌మన్ ఇళ్ల నిర్మాణం జరిగేనా?
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:45 PM
పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీ తెగకు చెందిన గిరిజనులకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. సకాలంలో నిధులు మంజూరుకాకపోవడంతో లబ్ధిదారులు వివిధ దశల్లో నిర్మాణాలు నిలిపివేశారు.
మండలంలో 2,464 మంది పీవీటీజీ గిరిజనులకు ఇళ్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
సకాలంలో నిధులు విడుదలకాక నిలిచిపోయిన నిర్మాణాలు
కేవలం 291 ఇళ్లు మాత్రమే పూర్తి
అరకులోయ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీ తెగకు చెందిన గిరిజనులకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. సకాలంలో నిధులు మంజూరుకాకపోవడంతో లబ్ధిదారులు వివిధ దశల్లో నిర్మాణాలు నిలిపివేశారు.
అరకులోయ మండలంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,464 మంది పీవీటీజీ గిరిజన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2,39,000లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో రూ.70 వేలు జమ చేసింది. రూఫ్ లెవెల్‌కు రూ.90 వేలు, శ్లాబ్, ఫినిషింగ్ పనులు పూర్తి చేస్తే రూ.40 వేలు, కూలీ కింద రూ.27 వేలు విడతల వారీగా విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు కేవలం 291 ఇళ్లు పూర్తి కాగా, సుమారు 1,637 ఇళ్లు లింటల్ స్థాయిలో నిలిచిపోయాయి. మరో 70 ఇళ్లు ఇంకా ప్రారంభంకాలేదు. మరో 466 ఇళ్లు స్థల సమస్య కారణంగా లబ్ధిదారులకు కేటాయింపులు జరపలేదు. సకాలంలో నిధులు విడుదలకాకపోవడంతో లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టడం లేదు. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత లబ్ధిదారులకు అదనంగా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. అయితే ప్రకటించి ఏడాదికావస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిధులు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.