Share News

కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ పూర్తయ్యేనా?

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:10 PM

మండలంలో డౌనూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ గత మూడేళ్లుగా పిల్లర్లకే పరిమితమైంది.

కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ పూర్తయ్యేనా?
పిల్లర్ల స్థాయి దాటని సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం

మూడేళ్లుగా పిల్లర్లకే పరిమితమైన నిర్మాణాలు

గత వైసీపీ ప్రభుత్వంలో అట్టహాసంగా శంకుస్థాపన

నిధులు విడుదల చేయకపోవడంతో ముందుకు కదలని పనులు

అందుబాటులోకి వస్తే ఉపాధి దొరుకుతుందని ఆశించిన స్థానిక మహిళలు

కలగానే మిగిలిందని నిరాశ

కొయ్యూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో డౌనూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ గత మూడేళ్లుగా పిల్లర్లకే పరిమితమైంది. 2023 అక్టోబరు 20న అప్పటి గిరిజన సంక్షేమశాఖా మంత్రి పీడిక రాజన్నదొర అట్టహాసంగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా శంకుస్థాపన చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

మండలంలో డౌనూరు కేంద్రంగా కాఫీ క్యూరింగ్‌, రోస్టింగ్‌, గ్రైండింగ్‌, ప్యాంకింగ్‌ చేసేందుకు రూ.4 కోట్ల వ్యయంతో సమీకృత కాఫీ ప్రొసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖామంత్రి శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో పిల్లర్ల స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ యూనిట్‌ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చి ఉంటే కాఫీ పండించే రైతులు దళారుల బారిన పడకుండా నేరుగా జీసీసీకి విక్రయించి లాభాలు ఆర్జించే వారు. అంతే కాకుండా కాఫీ క్యూరింగ్‌, రోస్టింగ్‌, ప్యాకింగ్‌ తదితర పనులకు స్థానిక మహిళలకు ఉపాధి దొరికేది. ఇవేమీ జరగకపోవడంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఈ యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Feb 15 , 2026 | 11:11 PM