జీడి పిక్కల ప్రొసెసింగ్ యూనిట్ పునఃప్రారంభమయ్యేనా?
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:18 PM
మండలంలోని రావణాపల్లి గ్రామంలో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన జీడిపిక్కల ప్రొసెసింగ్ యూనిట్ నిరుపయోగంగా ఉంది.
పదేళ్ల క్రితం రావణాపల్లిలో ఏర్పాటు
రూ.40 లక్షలు వెచ్చించి భవన నిర్మాణం, యంత్ర పరికరాలు కొనుగోలు
ప్రారంభమైన ఏడాదిలోపే మూసివేత
నిధులను వెలుగు సిబ్బంది పక్కదారి పట్టించారని ఆరోపణలు
కొయ్యూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని రావణాపల్లి గ్రామంలో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన జీడిపిక్కల ప్రొసెసింగ్ యూనిట్ నిరుపయోగంగా ఉంది. తొమ్మిదేళ్ల క్రితం మూతపడిన ఈ యూనిట్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ యూనిట్ మూలకు చేరడంతో యంత్ర పరికరాలు కూడా తుప్పు పట్టాయి. ఈ యూనిట్‌ను పునఃప్రారంభిస్తే మహిళలకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు.
రావణాపల్లి గ్రామంలో మహిళల ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీడిపిక్కల ప్రొసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో ఈ యూనిట్‌ను నెలకొల్పారు. ఈ రూ.40 లక్షల్లో రూ.15.45 లక్షల వ్యయంతో యూనిట్ భవనాన్ని, జీడిమామిడి పిక్కలు ఎండబోసేందుకు కళ్లం, ఇతర సదుపాయాలు కల్పించారు. అలాగే యూనిట్ నిర్వహణకు అవసరమయ్యే స్టీమ్ బాయిలర్, సెపరేటర్, పీలర్, గ్రేడర్‌తో పాటు చేతి పనికి వీలుగా ఎనిమిది టేబుళ్లు, కట్టర్‌లను సమకూర్చారు. సంవత్సరానికి 200 టన్నులు ప్రొసెసింగ్ జరిపేలా అడ్వాన్సుడ్ టెక్నాలజీ గల యంత్రాలను ఏర్పాటు చేశారు. రావణాపల్లి గ్రామైక్య సంఘం సభ్యులకు ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ముందుగా జీడిమామిడి పిక్కల కొనుగోలుకు పెట్టుబడి నిమిత్తం స్థానిక వెలుగు కార్యాలయం ద్వారా రూ.3 లక్షల కార్పస్ ఫండ్‌ను గ్రామైక్య సంఘానికి సమకూర్చారు. ప్రొసెసింగ్ సెంటర్ నిర్వహణకు కొందరిని ఎంపిక చేసి శ్రీకాకుళం, తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో శిక్షణ ఇప్పించారు. మార్కెటింగ్ కోసం ఒడిశాకు చెందిన ఓలం కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. రావణాపల్లి గ్రామైక్య సంఘం పరిధిలోని 20 డ్వాక్రా సంఘాల్లో 365 మంది సభ్యులు ఉండగా, వారిలో 40 మందికి పైబడి ఈ యూనిట్ ద్వారా లబ్ధి చేకూరుందని అధికారులు భావించారు. రోజుకు 20 కిలోల పిక్కలను బాయిల్ చేసి వాటిని ఆరబెట్టిన అనంతరం కటింగ్, శీతల గదిలో నిల్వ, పొరల తొలగింపు వంటి పనులు నెల రోజులపాటు జరిపారు. ప్రతీ 20 కిలోల జీడిమామిడి పిక్కల ద్వారా నాలుగున్నర కిలోల జీడి పప్పు లభ్యమయ్యేది. గుర్రం పప్పును కిలో రూ.700 నుంచి రూ.800, రెండో రకం రూ. 400 నుంచి రూ.600 మధ్య, మూడవ రకం రూ.300లోపు విక్రయించాలని నిర్ణయించారు. ఆ విధంగా సుమారు 200 కిలోల పప్పును అమ్మకానికి సిద్ధం చేశారు. జీడిపప్పు శాంపిల్స్‌ను మార్కెట్‌కు తీసుకు వెళ్లడం, పలు వ్యాపార సంస్థలు, హోటళ్లకు చూపించి సంఘ సభ్యులే మార్కెటింగ్ చేసుకోవాలని నిర్ణయించారు. అయితే అధునాతన బాయిలర్ లేని కారణంగా ప్రారంభించి ఏడాది గడవక ముందే ఈ యూనిట్ మూతపడింది. ఈ విషయం తెలిసి అప్పటి ఐటీడీఏ పీవో బాలాజీ 2020లో రూ.4 లక్షలతో అధునాతన బాయిలర్ ఏర్పాటు చేయించారు. అయినా యూనిట్ పునఃప్రారంభం కాలేదు. అయితే దీనికి కార్పస్ ఫండ్‌గా ఇచ్చిన నిధులను వెలుగు సిబ్బంది పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లపాటు ఐటీడీఏ ఇచ్చిన నిధులను స్వాహా చేయడమే కాకుండా నాణ్యత లేని పిక్కల కొనుగోలు, తీసిన పప్పు గోల్‌మాల్, తదితర అంశాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే ఈ ఫ్యాక్టరీ మూతపడిన విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారని ప్రచారం జరుగుతోంది. జీడిమామిడి పిక్కల సీజన్ మరో రెండు నెలల్లో ప్రారంభమవుతుంది. గత సీజన్‌లో బహిరంగ మార్కెట్‌లో కిలో జీడిమామిడి పిక్కల ధర రూ.140లు ఉన్నప్పటికీ స్థానికంగా దళారులు రూ.110 లకు మించి కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్ పునఃప్రారంభమైతే కొంత మందికి ఉపాధి దొరకడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని పలువురు అంటున్నారు. ఈ విషయమై వెలుగు ఏపీఎం సాధనను సంప్రతించగా ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని తెలిపారు.