వంద పడ‘కల నెరవేరేనా’?
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:13 AM
స్థానిక ఏరియా ఆస్పత్రిలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఐదు దశాబ్దాల క్రితం డిస్పెన్సరీ కోసం నిర్మించిన భవనంలోనే ఈ ఆస్పత్రి కొనసాగుతోంది. వంద పడకల ఆస్పత్రిగా ప్రభుత్వం స్థాయి పెంచినా ఇప్పటికీ పూర్తి స్థాయి సదుపాయాలు అందుబాటులోకి రాలేదు.
ఏరియా ఆస్పత్రిలో సమస్యలు తిష్ఠ
ఐదు దశాబ్దాల నాటి భవనంలోనే సేవలు
అప్‌గ్రేడ్ చేసినా అందుబాటులోకి రాని సదుపాయాలు
పెరుగుతున్న రోగుల తాకిడి
ఒకే మంచం ఇద్దరికి కేటాయింపు
నేలపై పరుపు వేసి చికిత్స
వైద్యులందరికీ ఒకే గది
అర్ధంతరంగా నిలిచిపోయిన నూతన భవన నిర్మాణాలు
పట్టించుకోని పాలకులు, అధికారులు
చింతపల్లి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఏరియా ఆస్పత్రిలో సమస్యలు తిష్ఠ వేశాయి. ఐదు దశాబ్దాల క్రితం డిస్పెన్సరీ కోసం నిర్మించిన భవనంలోనే ఈ ఆస్పత్రి కొనసాగుతోంది. వంద పడకల ఆస్పత్రిగా ప్రభుత్వం స్థాయి పెంచినా ఇప్పటికీ పూర్తి స్థాయి సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. రోగులకు సరిపడా బెడ్లు, వైద్యులకు అవసరమైన గదులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఒకే మంచంపై ఇద్దరు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేలపై పరుపులు వేసి రోగులకు చికిత్స అందించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. వంద పడకల ఆస్పత్రి నూతన భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంది.
స్థానిక ఏరియా ఆస్పత్రికి చింతపల్లి, జీకేవీధితో పాటు జి.మాడుగుల, కొయ్యూరు మండలాల సరిహద్దు గ్రామాల ఆదివాసీలు చికిత్స కోసం వస్తుంటారు. ఏరియా ఆస్పత్రి పరిధిలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఏరియా ఆస్పత్రికి గ్రామాల నుంచి నేరుగా చికిత్స కోసం 60 శాతం మంది రోగులు, పీహెచ్‌సీల నుంచి మెరుగైన చికిత్స కోసం 40 శాతం మంది రోగులు వస్తుంటారు. ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 400-450 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో వివిధ వ్యాధులతో బాధపడే రోగులు, బాలింతలు, గర్భిణులు 60-70 మంది ఇన్‌పేషెంట్లుగా చేరుతుంటారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక వైద్యనిపుణుల పోస్టులు భర్తీ చేయడంతో ఏరియా ఆస్పత్రి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించే రోగుల సంఖ్య తగ్గింది. రోగులకు ఏరియా ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం అందుతుంది. ప్రసవం కష్టమైన గర్భిణులకు ఆస్పత్రిలోనే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. దీంతో ఏరియా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్ల సంఖ్య భారీగా పెరిగింది.
వసతి సమస్యతో అవస్థలు
రోగులు, వైద్యులు, వైద్య సిబ్బంది వసతి సమస్యతో అవస్థలు పడుతున్నారు. రోగులకు కేవలం రెండు వార్డులు మాత్రమే ఉన్నాయి. ఏరియా ఆస్పత్రిలో 100 పడకలు ఉండాలి. ఆస్పత్రిలో కేవలం 45 మంచాలు మాత్రమే వున్నాయి. ఒక వార్డు సాధారణ రోగులకు, మరో వార్డు గర్భిణులు, బాలింతలకు కేటాయించారు. వివిధ విభాగాల వైద్యనిపుణులు కూర్చోవడానికి గదులు అందుబాటులో లేవు. ఐదు, ఆరుగురు వైద్యులు ఒకేచోట కూర్చోని వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌లు, క్యాజువాలిటీ(అత్యవసర విభాగం)నిర్వహణ, మందులు, రక్త నిల్వలు భద్రపరిచేందుకు గదులు సరిపడక ఇబ్బంది పడుతున్నారు. వైద్యులు అందుబాటులో ఉన్న గదుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్వహణకు తగిన వసతి లేకపోవడం వల్ల వివిధ విభాగాలకు చెందిన అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం మంజూరు చేయలేదు.
నేలపై రోగులకు చికిత్స
ఏరియా ఆస్పత్రిలో రోగులకు సరిపడా మంచాలు అందుబాటులో లేక నేలపై పరుపులు వేసి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఎపిడమిక్(వ్యాధులు) సీజన్ కొనసాగుతున్నది. దీంతో మలేరియా, టైఫాయిడ్, వైరల్, డెంగ్యూ జ్వరాలు, అతిసార బాధితులు అధికంగా ఆస్పత్రికి వస్తున్నారు. ఈ వ్యాధులతో వచ్చే రోగులను కచ్చితంగా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందించాలి. దీంతో మంచాలు రోగులకు సరిపడడం లేదు. ఒక మంచంపై ఇద్దరు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయినా రోగుల సంఖ్య అధికం కావడంతో నేలపై పరుపు వేసి వైద్యం చేస్తున్నారు. వసతి సమస్య కారణంగా రోగులు దయనీయ పరిస్థితిలో ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అర్ధంతరంగా నిలిచిన భవన నిర్మాణాలు
వంద పడకల ఆస్పత్రి నూతన భవనాల నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. వంద పడకల ఆస్పత్రి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. నిర్మాణ బాధ్యతలను ఏపీఎంఎస్‌ఐడీసీ ఇంజనీర్ల పర్యవేక్షణలో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌కి 2021లో అప్పగించింది. అయితే 2024 వరకు గత వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.రెండు కోట్లు మాత్రమే విడుదల చేసింది. భవన నిర్మాణాలు 2023 నాటికి పూర్తి చేయాల్సి వున్నప్పటికి నిధుల కొరత కారణంగా మందకొడిగా పనులు సాగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పెండింగ్‌లో ఉన్న రూ.8 కోట్లు విడుదల చేసింది. దీంతో భవన నిర్మాణాలు 75 శాతం పూర్తయ్యాయి. రెండో విడత నిధులు విడుదలకాకపోవడంతో ఆరు నెలల క్రితం నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. దీంతో నూతన భవన నిర్మాణాలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ స్పందించి భవన నిర్మాణాలు పూర్తి చేసి రోగులు, వైద్యులు ఎదు ర్కొంటున్న వసతి సమస్యను పరిష్కరించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.