సెప్టెంబరు ఆదుకుంటుందా?
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:52 AM
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాధార ప్రాంతాల్లో వరినాట్లు లేనట్టేనా? తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయి? ఎల్‌నినో ప్రభావం రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా ఉంటుందా? లేకపోతే ఇందుకు భిన్నంగా సెప్టెంబరులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయా? వంటి సందేహాలు రైతులను సందిగ్ధంలోకి నెడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో వరినాట్లు ఆగస్టులో మొదలుపెట్టి, సెప్టెంబరు చివరి వరకు వేస్తుంటారు.
గత 30 సంవత్సరాల్లో సగటు వర్షపాతం ఈ నెలలోనే అధికం
జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లాలో 60 శాతం మేర లోటు వర్షం
వచ్చే నెలలో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని ఐఎండీ అంచనా
ఖరీఫ్ వరిసాగుపై ఆశ నిరాశల మధ్య రైతులు ఊగిసలాట
అనకాపలి అగ్రికల్చర్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాధార ప్రాంతాల్లో వరినాట్లు లేనట్టేనా? తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఇంకెన్ని రోజులు కొనసాగుతాయి? ఎల్‌నినో ప్రభావం రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా ఉంటుందా? లేకపోతే ఇందుకు భిన్నంగా సెప్టెంబరులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయా? వంటి సందేహాలు రైతులను సందిగ్ధంలోకి నెడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో వరినాట్లు ఆగస్టులో మొదలుపెట్టి, సెప్టెంబరు చివరి వరకు వేస్తుంటారు. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో రిజర్వాయర్ల ఆయకట్టు మినహా మరెక్కడా వరినాట్లు పడలేదు. అయితే గతంలో ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాల డేటా ఆధారంగా సెప్టెంబరులో ఆశాజనంగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ మిగిలిన జిల్లాలతో పోలిస్తే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావం చాలా ఎక్కువ వుంది. ఈ రెండు జిల్లాలతో పోలిస్తే పొరుగున వున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా వర్షపాతం ఒకింత మెరుగ్గానే వుంది.
ఈ ఏడాది తీవ్ర ఎన్‌నినో ప్రభావంతో జూన్ నుంచి ఆగస్టు వరకు 53 శాతం లోటు వర్షంపాతం వుండగా.. అనకాపల్లి జిల్లాలో మరికొంత ఎక్కువగా 60 శాతం మేర లోటు వర్షపాతం వుంది. ఇది జిల్లాలో నెలకొన్ని తీవ్రకరువు పరిస్థితులకు అద్దం పడుతున్నది. సాధారణంగా ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరంలో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు తక్కువ కురుస్తుంటాయి. దీంతో ఆగస్టు 15వ తేదీ వరకువేచి చూసి, ఆ తరువాత ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది గడువు దాటి పక్షం రోజులు అయినప్పటికీ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను విడుదల చేయలేదు. మరోవైపు ఈ పక్షం రోజుల్లో వర్షాభావం మరింత తీవ్రమైంది. వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండాలు ఏపీ వైపు రాకుండా ఒడిశా మీదుగా పయనిస్తున్నాయి. దీంతో గత మూడు నెలల కాలంలో నాలుగైదుసార్లు అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ ఒక్కసారి కూడా అనకాపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడలేదు.
వ్యవసాయాన్ని దెబ్బతీస్తున్న ఎల్‌నినోలు
గత మూడు దశాబ్దాల్లో వచ్చిన ఏడు ఎల్‌నినోలు వ్యవసాయాన్ని దెబ్బతీశాయి. 1997-98, 2002-03, 2004-05, 2009-10, 2015-16, 2018-19, 2023-24లలో ఎల్‌నినోలు సంభవించాయి. 2004-05, 2018-19 సంవత్సరాల్లో ఎల్‌నినోల తీవ్రత అంతగా లేకపోయినా.. మిగిలిన సంవత్సరాల్లో వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశాయి. అనకాపల్లి జిల్లాలో అత్యధిక భాగం వర్షాధార భూములు కావడం వల్ల ఈ దుస్థితి నెలకొంది.
సెప్టెంబరుపైనే ఆశలు
ఖరీఫ్ సీజన్‌లో జూన్, జూలై, ఆగస్టు నెలలతో పోలిస్తే.. సెప్టెంబరులో ఎక్కువ వర్షం కురిసినట్టు గత మూడు దశాబ్దాల్లో వర్షపాతం డేటాను పరిశీలిస్తే అవగతం అవుతుంది. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా సెప్టెంబరులో ఆశాజనకంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఖరీఫ్‌లో వరితోపాటు మిగిలిన పంటలు ఎంతోకొంత పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యపు నాట్లు అంటే సెప్టెంబరు మొదటి పక్షంలో వరి నాట్లు వేయడం జిల్లా రైతులకు కొత్తేమి కాదని, దీనివల్ల ధాన్యం దిగుబడి కొంతమేర తగ్గినప్పటికీ మొత్తం మీద పరిస్థితి ఆశాజనంగా వుంటుందని అంటున్నారు. 1994 నుంచి 2023 వరకు పరిశీలిస్తే.. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో అధిక వర్షపాతం నమోదైందని చెబుతున్నారు. ఈ 30 ఏళ్లలో సగటు వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. జూన్‌లో 123.6 మిల్లీమీటర్లు, జూలైలో 142.3, ఆగస్టులో 170.5, సెప్టెంబరులో 233.3, అక్టోబరులో 210.4 మిల్లీ మీటర్లుగా నమోదైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ఏడాది కూడ సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని, తద్వారా ఖరీఫ్ గట్టెక్కుతుందని ఆశిస్తున్నారు.
ఐఎండీ ఏమంటున్నదంటే..
ఉత్తరాంధ్ర ప్రాంతంలో వాతావరణ సరళిని అనుసరించి సెప్టెంబరులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముందస్తు అంచనా వేసింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సెప్టెంబరు రెండో పక్షం నుంచి నైరుతి రుతుపవనాలు తిరుముఖం పడతాయి. ఈ సమయంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం వుంది. అక్టోబరు రెండవ వారంలో ఈశాన్య రుతుపవనాల రాక మొదలుతుంది. ఎల్‌నినో సంవత్సరాల్లో అక్టోబరు, నవంబరు నెలల్లో అల్పపీడనాలు ఏర్పడి ఇవి వాయుగుండాలుగా, తుఫాన్లుగా బలపడిన సందర్భాలు వున్నాయని, వీటి కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఐఎండీ సూచిస్తున్నది.