Share News

బియ్యం ధరలకు కళ్లెం పడేనా?

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:25 AM

బియ్యం ధరలు ఠారెత్తిస్తున్నాయి. సన్న రకాలు కిలో రూ.90పైనే అమ్ముతున్నారు.

బియ్యం ధరలకు కళ్లెం పడేనా?

రకాల వారీగా ధరలు నిర్ణయించిన ప్రభుత్వం

ఏదైనా కిలో రూ.82కి మించి అమ్మకూడదని ఆదేశం

సూపర్‌ మార్కెట్లలో ఇంకా కిలో రూ.89 చొప్పున విక్రయం

డీమార్ట్‌లో బియ్యం కౌంటర్లు మూసివేత

రిటైల్‌ దుకాణాలపై దాడులకే

విజిలెన్స్‌, తూనికలు కొలతల శాఖ పరిమితం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

బియ్యం ధరలు ఠారెత్తిస్తున్నాయి. సన్న రకాలు కిలో రూ.90పైనే అమ్ముతున్నారు. 26 కిలోల బస్తా రూ.2,400 పైనే విక్రయిస్తున్నారు. ఈ ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. గత వారం, పది రోజులుగా రైతుబజార్లలోని ప్రత్యేక కౌంటర్లలో ‘ధరణి’ పేరుతో 26 కిలోల బస్తా రూ.1,300కు అమ్ముతున్నారు. రిటైల్‌గా కిలో రూ.50 చొప్పున ఇస్తున్నారు. ఇవి మొదట్లో బాగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకటి, రెండు చోట్ల తప్పితే మిగిలినచోట్ల మంచి రకాలే అమ్ముతున్నారు. అయితే బ్రాండ్‌ బియ్యం ధరలు మాత్రం దిగి రాలేదు.

విశాఖ జిల్లాలో అక్షయ, లలిత వంటి రకాలకు బాగా డిమాండ్‌. వాటిని అవే ధరలకు అమ్ముతున్నారు. తాజాగా పౌర సరఫరాల శాఖ ఏ రకం బియ్యం ఎంతకు విక్రయించాలో పేర్కొంటూ ధరలను నిర్ణయించింది. వీటిని నాలుగైదు రోజుల క్రితమే బియ్యం వ్యాపారులకు ఇచ్చి, ఆ ప్రకారమే అమ్మాలని సూచించింది. అంతేకాకుండా ఆ ధరల పట్టికను కూడా ప్రదర్శించాలని ఆదేశించింది. కానీ చాలామంది ఆ సూచన పట్టించుకోలేదు. యథా ప్రకారం అధిక ధరలకే అమ్ముతున్నారు. పాత బస్తాలపై పాత రేట్లు ఉన్నా..మార్కెట్‌ రేటు పెరిగిందని ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు అమ్ముతున్నారు. వీటిపై ఫిర్యాదులు అందడంతో విజిలెన్స్‌, తూనికలు కొలతల శాఖాధికారులు గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి సూచించిన రేట్ల కంటే అధికంగా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇదిలావుంటే ఈ రేట్లకు బియ్యం అమ్మడం ఇష్టం లేక డీమార్ట్‌లో బియ్యం కౌంటర్లు అన్నీ మూసేశారు.

నగరంలో సుమారు పది వరకు ఉన్న డీమార్టుల్లో కిలో రూ.60 నుంచి రూ.200 వరకు అనేక రకాలు ఉండేవి. బిర్యానీకి ఉపయోగించే బాస్మతీ రకాలు కూడా అమ్మేవారు. అధికారులు తనిఖీకి వస్తే...సూచించిన రేట్ల కంటే ఎక్కువ ధరలు ఉన్నాయని కేసులు పెడతారని బాస్మతీ రకంతో సహా అన్ని రకాల బియ్యాన్ని షాపుల నుంచి తరలించేశారు. ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టేశారు. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, అక్కయ్యపాలెం, గోపాలపట్నం, గాజువాక, కంచరపాలెంలో ప్రైవేటు సూపర్‌ మార్కెట్లలో మాత్రం ఇంకా అధిక ధరలకే బియ్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం సూచించిన రేట్లకు అక్కడ బియ్యం లభించడం లేదు. కర్నూలు బీపీటీ సన్న బియ్యం అంటూ కిలో రూ.89 నుంచి రూ.95 వరకు అమ్ముతున్నారు. విజిలెన్స్‌ అధికారులు పూర్ణా మార్కెట్‌, ఇతర ప్రాంతాల్లో చిల్లర, రిటైల్‌ దుకాణాలపై మాత్రమే దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు సూపర్‌ మార్కెట్ల వైపు వెళ్లడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ కూడా ప్రభుత్వ బియ్యం ధరల పట్టికలు ప్రదర్శించి, ఆయా రకాలు విక్రయించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.


బియ్యం దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

అధిక ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించి కేసులు

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

అధిక ధరలకు బియ్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, తూనికలు కొలతల శాఖాధికారులు ఉమ్మడిగా పలు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించారు. పూర్ణామార్కెట్‌, అల్లిపురం, స్ర్పింగ్‌ మార్కెట్లలో మొత్తం ఏడు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. కొన్నిచోట్ల 26 కిలోల బియ్యం బస్తాపై తయారీదారు, ప్యాకర్‌ పేరు లేకపోవడంతో ఆ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని దుకాణాల్లో హెచ్‌ఎంటీ, సోనామసూరి బియ్యం ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. హెచ్‌ఎంటీ బియ్యం ప్యాకెట్‌ (పది కిలోలు) ప్రభుత్వ రేట్ల ప్రకారం రూ.300-రూ.330కి విక్రయించాల్సి ఉండగా రూ.440 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నట్టు గుర్తించారు. అదేవిధంగా పది కిలోల సోనామసూరి రకం ప్యాకెట్‌ ధర రూ.660 కాగా దానిని రూ.920కి అమ్మినట్టు గుర్తించి కేసులు పెట్టారు. కొన్ని చోట్ల బియ్యం ప్యాకెట్లపై నెల, సంవత్సరం లేకపోవడం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకో దుకాణంలో పది కిలోల డైమండ్‌ ప్రీమియం సోనా రకం బియ్యం బస్తాపై ఎంఆర్‌పీని చెరిపేసినట్టు గుర్తించి సీజ్‌ చేశారు.

Updated Date - Nov 20 , 2026 | 01:25 AM