మినీ మార్టులు ముందుకుసాగేనా?
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:58 AM
బియ్యం కార్డుదారుల కోసం ఏర్పాటుచేస్తున్న మినీ మార్టులపై రేషన్ డీలర్లు పెదవివిరుస్తున్నారు.
బియ్యం కార్డుదారులకు నిత్యావసర సరుకులు విక్రయించేలా రేషన్ డిపోల్లో ఏర్పాటు
నగరంలో 83...
ఒకటో తేదీ నుంచి అమ్మకాలు
బయట మార్కెట్ కంటే ఎక్కువ ధరకు సరుకులు సరఫరా చేస్తున్న ప్రైవేటు ఏజెన్సీ
అలాగైతే కష్టమంటున్న డీలర్లు
విశాఖపట్నం/గాజువాక/గోపాలపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
బియ్యం కార్డుదారుల కోసం ఏర్పాటుచేస్తున్న మినీ మార్టులపై రేషన్ డీలర్లు పెదవివిరుస్తున్నారు. పౌర సరఫరా అధికారులు ఖరారు చేసిన ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’ ఏజెన్సీ బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ రేటుకు సరుకులు సరఫరా చేస్తుండడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు సరుకులు అమ్మితే కొంటారు గానీ ఎక్కువకు విక్రయిస్తే అమ్మకాలు ఎలా సాగుతాయని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. డీలర్ల గ్రూపులో పలువురు ఇదే విషయమై అధికారులను నిలదీశారు. పూర్ణామార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేసి డిపోలకు సరఫరా చేస్తున్నారని, ఇందుకు మధ్యలో ఒక ఏజెన్సీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
విశాఖపట్నం, విజయవాడల్లో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన రేషన్ డిపోలను మినీ మార్టులుగా మార్చాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది. డిపోలకు అవసరమైన సరుకులను టోకుగా కొనుగోలు చేస్తే బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు లభ్యమవుతాయని, వాటిని కార్డుదారులకు బయట కంటే కిలోకు రూపాయి నుంచి రెండు రూపాయలు తగ్గించి విక్రయించుకోవచ్చునని డీలర్లకు వివరించింది. దీంతో నగరంలో 83 మంది డీలర్లు ముందుకువచ్చారు. సరుకుల సరఫరా, ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టుకునేందుకు వీలుగా యాప్ రూపకల్పన, డిపో ముందు బోర్డు ఏర్పాటు నిమిత్తం ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సరుకులు అమ్మకాలు ప్రారంభించేందుకు వారం క్రితం డీలర్లు పౌర సరఫరాల శాఖ ఎంపిక చేసిన ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’ ఏజెన్సీకి యాప్ ద్వారా ఇండెంట్ పెట్టారు. ఫ్రీడమ్ ఆయిల్ కిలో రూ.177, పల్నాడు కింగ్ కందిపప్పు రూ.132, శనగపప్పు రూ.88, స్వస్తిక్ బ్రాండ్ మినప్పప్పు రూ.142, ఉప్పు కిలో ప్యాకెట్ రూ.27కు సంబంధిత ఏజెన్సీ సరఫరా చేసింది. అయితే సోమవారం మార్కెట్‌లో ఫ్రీడమ్ ఆయిల్ కిలో రూ.170, కందిపప్పు రూ.122, శనగపప్పు రూ.80, మినప్పప్పు రూ.132కు ఉన్నట్టు డీలర్లు చెబుతున్నారు. బయట మార్కెట్ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కార్డుదారులు తమ వద్ద సరుకులు ఎందుకు కొనుగోలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో డీలర్ ఒకేసారి రూ.ఐదు వేల నుంచి రూ.10 వేల విలువగల సరుకులు కొనుగోలు చేయాలని చెబుతున్నారని, బియ్యం కార్డుదారులు వాటిని తీసుకోకపోతే తమ పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు. ప్రారంభం కాక ముందే మినీ మార్టులు నిర్వహించనున్న డీలర్ల నుంచి వ్యతిరేకత వచ్చిన విషయం రేషన్ డీలర్ల గ్రూప్‌లో జోరుగా చర్చ సాగుతుంది.