Share News

మాచ్‌ఖండ్‌కు మంచి రోజులొచ్చేనా?

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:25 AM

మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయనేది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలింది. 1955లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చార్రితక జల విద్యుత్‌ కేంద్రం నేటికీ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో నిత్యం మరమ్మతులు, ప్రమాదాలు జరుగుతున్నాయి.

మాచ్‌ఖండ్‌కు మంచి రోజులొచ్చేనా?
మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం

దశాబ్ద కాలంగా కాగితాలకే పరిమితమైన ఆధునికీకరణ

తరచూ మరమ్మతులు, ప్రమాదాలు

ఆందోళన చెందుతున్న జెన్‌కో అధికారులు, సిబ్బంది

చారిత్రక జల విద్యుత్‌ కేంద్రానికి ఈ దుస్థితిపై సర్వత్రా విమర్శలు

(ఆంధ్రజ్యోతి- పాడేరు/ముంచంగిపుట్టు)

మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రానికి మంచి రోజులు ఎప్పుడు వస్తాయనేది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలింది. 1955లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చార్రితక జల విద్యుత్‌ కేంద్రం నేటికీ ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో నిత్యం మరమ్మతులు, ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాజాగా ఈ ఏడాది మే నెల 23న వాక్యూమ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ యార్డ్‌లో షార్ట్‌ సర్క్యూట్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు గాయపడడంతో పాటు జల విద్యుత్‌ కేంద్రానికి భారీగానే నష్టం కలిగింది. పైగా ప్రమాదం కారణంగా దెబ్బతిన్న వైరింగ్‌, ఇతర పనులకు మరమ్మతులు చేపట్టి యథాస్థితికి తీసుకువచ్చేందుకు కనీసం నెల రోజులు పడుతుందని అధికారులు అంటున్నారు. దీంతో మే 23 నుంచి ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ క్రమంలో మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రం భవిష్యత్తుపై సర్వత్రా ఆందోళనలు నెలకొంటున్నాయి.

దశాబ్ద కాలంగా కాగితాలకే పరిమితమైన ఆధునికీకరణ

1955లో అందుబాటులోకి వచ్చిన మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి సుమారుగా ఏడు దశాబ్దాలు పూర్తయ్యాయి. వాస్తవానికి ఎటువంటి యంత్రాలనైనా ఐదేళ్లు లేదా పదేళ్లకు సంపూర్ణంగా ఆధునికీకరించాలి. జల విద్యుదుత్పత్తి చేసే క్రమంలో నిరంతరం పని చేసే యంత్రాల పట్ల మరింత అప్రమత్తత, ముందు జాగ్రత్తలతో వాటిని ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలి. కానీ ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి సొత్తుగా ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆశించిన స్థాయిలో శ్రద్ధ కనబరచకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య అనాథలా పరిస్థితి మారింది. దీంతో ఏళ్లు గడుస్తున్నప్పటికీ జల విద్యుత్‌ కేంద్రాన్ని ఆధునికీకరించేందుకు అడుగులు పడడం లేదు. అయితే పదేళ్ల క్రితం కేవలం మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రాన్ని ఆధునికీకరించాలనే అంశంపై ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, జెన్‌కో అధికారులు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో సమావేశమయ్యారు. ఈ క్రమంలో రూ.500 కోట్లతో దానిని ఆధునికీకరించాలని నిర్ణయించారు. అలాగే అందుకు గాను ఒక ప్రైవేటు ఏజెన్సీతో డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును సైతం రూపొందించడమే కాకుండా, ఇరు రాష్ట్రాలకు చెందిన జెన్‌కో అధికారులతో కూడిన బృందం సైతం పలుమార్లు సందర్శనలు చేపట్టి, అధ్యయనం చేసింది. కానీ నేటికీ అందుకు సంబంధించిన కార్యాచరణ ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో జల విద్యుత్‌ కేంద్రం ఆధునికీకరణ సమావేశాలు, కాగితాలకే పరిమితమైంది.

ఆధునికీకరణ శూన్యం.. ప్రమాదాల మయం

ఏడు దశాబ్దాల నాటి జల విద్యుత్‌ కేంద్రం కావడంతో యంత్రాలు, ఇతర పరికరాలు కాలం చెల్లుతున్నాయి. ఈ క్రమంలో ఆధునీకరించడంతో పాటు ఎప్పటికప్పుడు మరమ్మతులు తలెత్తకుండా చూసుకోవాలి. కానీ మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రం విషయంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండడంతో మరమ్మతులు, ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఫలితంగా ప్రాజెక్టుకు నష్టాలు వాటిల్లుతున్నాయి. ఈ ఏడాది మే 23న వాక్యూమ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ యార్డ్‌లో సాంకేతిక సమస్యతో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రాజెక్టు లోపలకు వ్యాపించడంతో ఇద్దరు కార్మికులకు గాయాలు కావడంతో పాటు, పలు వైర్లు, ఇతర పరికరాలు మంటలకు ఆహుతయ్యాయి. దీంతో సుమారుగా రూ.3 కోట్లు నష్టం కలగడంతో పాటు నెల రోజులు పైబడి విద్యుదుత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే 2025 సెప్టెంబరు 9న 11 కేవీ ఫీడర్‌లో సాంకేతిక సమస్యతో మంటలు వచ్చి కొన్ని గంటలు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. 2025 ఆగస్టులో డీసీ పవర్‌ సప్లైలో సమస్య ఏర్పడడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోగా, అదే ఏడాది జూలై 4న ట్రాన్స్‌ఫార్మర్ల కేబుళ్లు కాలిపోయాయి. మే 15న కూలింగ్‌ వాటర్‌ పంపుల్లో సాంకేతిక సమస్యతో నాలుగు జనరేటర్లు నడపలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే 2024లో మే నెలలో ఎంవీఐ వాల్వ్‌లో నీరు లీకై విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కాగా, అదే ఏడాది ఏప్రిల్‌లో 11 కేవీ ఫీడర్‌ వైర్లు కాలిపోయాయి. అలాగే 2020లో వరదల కారణంగా విద్యుత్‌ కేంద్రం లోపలకు నీళ్లు రావడంతో విద్యుదుత్పత్తిని నిలిపేశారు. 2018లో ప్యానెల్‌ బోర్డులు దగ్ధంకాగా, 2014లో నాలుగో నంబర్‌ జనరేటర్‌లో మంటలు వచ్చాయి. ఇవి వెలుగులోకి వచ్చిన మరమ్మతులు, ప్రమాదాలు మాత్రమే. వాస్తవానికి జలవిద్యుత్‌ కేంద్రంలో నిత్యం ఏదో ఒక సాంకేతిక సమస్య ఏర్పడడం, అధికారులు, సిబ్బంది వాటిని సరిచేయడం పరిపాటిగా మారింది. మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ఆధునికీకరించేందుకు ఆంధ్రా, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోతే భవిష్యత్తులో నష్టాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:25 AM