Share News

ఐటీడీఏకు పూర్వ వైభవం వచ్చేనా?

ABN , Publish Date - Apr 16 , 2026 | 10:51 PM

రాష్ట్రంలోనే పెద్ద ఐటీడీఏగా గుర్తింపు ఉన్నా ఆ స్థాయిలో ప్రాధాన్యం, ప్రభుత్వ సహకారం అందని పరిస్థితి ఎన్నో ఏళ్లుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐటీడీఏలు నిర్వీర్యమయ్యాయనే చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో కూడా పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి.

ఐటీడీఏకు పూర్వ వైభవం వచ్చేనా?
పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం

రాష్ట్రంలో పెద్ద ఐటీడీఏగా గుర్తింపు ఉన్నా ఆశించిన స్థాయిలో నిధులు, ప్రాధాన్యం లేని వైనం

గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా దక్కని ఫలితం

పీవోగా ఆదిత్యవర్మ నియామకంతో పరిస్థితులు మారతాయని ఆశాభావం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోనే పెద్ద ఐటీడీఏగా గుర్తింపు ఉన్నా ఆ స్థాయిలో ప్రాధాన్యం, ప్రభుత్వ సహకారం అందని పరిస్థితి ఎన్నో ఏళ్లుగా ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐటీడీఏలు నిర్వీర్యమయ్యాయనే చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో కూడా పెద్దగా మార్పు కనిపించడం లేదన్న విమర్శలున్నాయి. తాజాగా ఐటీడీఏ పీవోగా ఆదిత్యవర్మ నియమితులు కావడంతో పరిస్థితులు మారతాయేమోననే ఆశాభావాన్ని మన్యంవాసులు వ్యక్తం చేస్తున్నారు.

ఐటీడీఏకు నిధుల కేటాయింపు, అధికారుల పోస్టుల భర్తీ, తదితర విషయాల్లో కనీస ప్రాధాన్యం కనిపించడం లేదు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకమారు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నా ఏడాదిగా పాలకవర్గ సమావేశం ఊసేలేని పరిస్థితి నెలకొంది. గతేడాది ఏప్రిల్‌లో ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తరువాత నుంచి మిన్నకున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నప్పటికీ పెద్దగా మార్పు లేదనే విమర్శలున్నాయి.

ఎట్టకేలకు పీవో నియామకం

గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ కార్యాలయాల్లో ప్రాజెక్టు అధికారిది కీలక పాత్ర. అటువంటి ముఖ్యమైన పీవో పోస్టు పాడేరులో తొమ్మిది నెలలు ఖాళీగా ఉంది. ఇక్కడ పీవోగా పని చేసిన వి.అభిషేక్‌ను అనివార్య కారణాలతో పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా 2025 జనవరిలో బదిలీ చేశారు. ఆ తరువాత ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. దీంతో స్థానిక జాయింట్‌ కలెక్టర్‌గా ఉన్న అభిషేక్‌గౌడ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. అలాగే 2025 సెప్టెంబరులో ఐటీడీఏ పీవోగా టి.శ్రీపూజను నియమించే వరకు అంటే దాదాపు తొమ్మిది నెలలు అభిషేక్‌ గౌడ ఇన్‌చార్జి పీవోగా కొనసాగారు. శ్రీపూజ గత ఆరు నెలలుగా ఐటీడీఏ పీవోగా కొనసాగుతుండగా, ఆమెను జేసీగా నియమిస్తూ, ఆమె భర్త అస్సాం కేడర్‌కు చెందిన 2022 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి ఆదిత్యవర్మను తాజాగా ఐటీడీఏ పీవోగా నియమించారు. గతంలో తొమ్మిది నెలలు పీవో పోస్టు ఖాళీగా ఉండడం, తరువాత ఆరు నెలలు పీవోగా పని చేసిన శ్రీపూజ సైతం పెద్దగా దృష్టి పెట్టని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో నియమితులైన ఆదిత్యవర్మ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా ఏమైనా కృషి చేస్తారా?, లేదా ఏదో కాలక్షేపంగా పని చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. వాస్తవానికి రాజ్యాంగం ఐదో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఐటీడీఏలకు, వాటికి పెద్ద దిక్కుగా ఉండే ప్రాజెక్టు అధికారికి ప్రత్యేకాధికారులుంటాయి. అలాగే ఐటీడీఏ పీవోలు నేరుగా గవర్నర్‌, రాష్ట్రపతులను సైతం కలిసే అవకాశాలున్నాయి. గిరిజన ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ శాఖలపై ఆధిపత్యం కలిగిన ప్రత్యేమైనది పీవో పోస్టు. ఈ నేపథ్యంలో దానిని సక్రమంగా వినియోగించి, ఉత్సాహంగా పని చేస్తే గిరిజనులకు మేలు జరగడంతో పాటు ఒక ఐఏఎస్‌ అధికారిగా పీవోకు సైతం మంచి గుర్తింపు లభిస్తుందని పలువురు అంటున్నారు. ఆ దిశగా కొత్త పీవో ఆదిత్యవర్మ ముందుకు వెళ్లాలని మన్యం వాసులు కోరుతున్నారు.

Updated Date - Apr 16 , 2026 | 10:52 PM