ఎప్పటికి దారికొచ్చేనో?
ABN , Publish Date - Mar 19 , 2026 | 10:53 PM
మండలంలోని బచ్చింత- దారగెడ్డ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఈ రోడ్డు పూర్తి కావలసి ఉన్నప్పటికీ ఇప్పటికీ అతీగతీ లేకుండా ఉంది.
అసంపూర్తిగా బచ్చింత- దారగెడ్డ రోడ్డు
గత ఏడాదే పూర్తి కావలసి ఉన్నా ఇప్పటికీ అతీగతీ లేని వైనం
మెటల్ వేసి వదిలేయడంతో రాకపోకలకు వాహనచోదకుల అవస్థలు
కొయ్యూరు, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బచ్చింత- దారగెడ్డ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఈ రోడ్డు పూర్తి కావలసి ఉన్నప్పటికీ ఇప్పటికీ అతీగతీ లేకుండా ఉంది. మెటల్ వేసి వదిలేయడంతో వాహనదారులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు.
మండలంలోని మూలపేట పంచాయతీ కొండ శిఖర పాలమామిడి, కొత్తవీధి, దారగెడ్డ గ్రామాలకు బచ్చింత గ్రామం నుంచి సుమారు 8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డుతో పాటు బచ్చింత సమీపంలో వంతెన నిర్మాణానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8 కోట్లు మంజూరయ్యాయి. వాస్తవానికి ఈ రహదారి నిర్మాణాన్ని 2025 మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలి. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. ఈ పనులను గుంటూరుకు చెందిన వెంకటేశ్వరావు అనే కాంట్రాక్టర్ అప్పట్లో టెండర్లలో దక్కించుకున్నారు. బచ్చింత సమీప వాగుపై రూ.60 లక్షల వ్యయంతో వంతెన నిర్మించారు. అలాగే పాలమామిడి వరకు సుమారు 5 కిలోమీటర్లు మట్టి పనులు పూర్తి చేశారు. మధ్యలో గల ఘాట్‌రోడ్డు మలుపుల వద్ద సీసీ రోడ్డు నిర్మించారు. ఈ రహదారి మధ్యలో నాలుగు కల్వర్టుల నిర్మాణం పూర్తి చేశారు. పాలమామిడి నుంచి కొత్తవీధి వరకు సుమారు కిలోమీటరు మేర మట్టి పనులు పూర్తి చేసి మెటల్ స్టోన్ డస్ట్ వేశారు. అయితే కొత్తవీధి నుంచి దారగెడ్డ వరకు కనీసం మట్టి పనులు చేపట్టలేదు. సుమారు రెండేళ్ల క్రితం పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. చేపట్టిన పనులకు ప్రభుత్వం రూ.3.6 కోట్లు చెల్లించేసినా ఆ తరువాత పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో పలు గ్రామాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం డీఈఈ రఘునాథరావు వివరణ కోరగా ఇప్పటి వరకు చేసిన పనులకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించామని, అయితే కురదల పనులకు చెల్లింపులు జరగక నిర్మాణాలు నిలిచాయన్నారు. దీనికి సంబంధించి త్వరలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని, నిధులు రాగానే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.