Share News

కళాశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యేనా?

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:55 AM

ఏపీ రెసిడెన్షియల్‌ బాలురు పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గంపెడాశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.

కళాశాలగా అప్‌గ్రేడ్‌ అయ్యేనా?
పెదబొడ్డేపల్లిలో ఏపీ రెసిడెన్షియల్‌ బాలుర ఉన్నత పాఠశాల

ఏళ్ల తరబడి ప్రతిపాదనల్లోనే నర్సీపట్నం ఏపీఆర్‌ఎస్‌

ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం కోసం విద్యార్థుల నిరీక్షణ

నర్సీపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ రెసిడెన్షియల్‌ బాలురు పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌పై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గంపెడాశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నర్సీపట్నానికి బాలుర రెసిడెన్షియల్‌ స్కూల్‌ను మంజూరు చేశారు. దీంతో అప్పటి స్థానిక ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పెదబొడ్డేపల్లిలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయించారు. అయితే ఇక్కడ పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు గురుకుల కళాశాలలో ఇంటర్‌ చదవాలంటే ఉమ్మడి గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌ (విజయపురి సౌత్‌)లోని ఏపీ బాలుర రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల, లేదంటూ కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల (కో-ఎడ్యుకేషన్‌)లో చేరాల్సి వస్తున్నది. అంత దూరం వెళ్లలేక నర్సీపట్నం, విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలల్లో చేరుతున్నారు. ఏపీఆర్‌ఎస్‌ విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకొని గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు.. నర్సీపట్నంలోని రెసిడెన్షియల్‌ స్కూల్‌ని జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయడానికి కృషి చేశారు. ఈ మేరకు ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా ఫైల్‌ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉండిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

కాగా నర్సీపట్నం ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ని జూనియర్‌ కళాశాలకు అప్‌గ్రేడ్‌ చేస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం వుండదు.

Updated Date - Aug 21 , 2026 | 12:55 AM