మోదకొండమ్మ ఉత్సవాల నిధులు వచ్చేనా?
ABN , Publish Date - May 31 , 2026 | 11:18 PM
స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలకు సర్కారు సాయంపై సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి ఉత్సవాలకు ముందే నిధులు మంజూరవుతాయి. కానీ ఈ ఏడాది ఉత్సవాలు ముగిసి పది రోజులైనప్పటికీ నిధులు విడుదలపై స్పష్టత లేకుండా పోయింది.
గతేడాది ఉత్సవాలకు నిధులు కేటాయించని పరిస్థితి
ఈ ఏడాది ఉత్సవాలు ముగిసి పది రోజులైనా మంజూరు కాని నిధులు
పాడేరు, మే 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలకు సర్కారు సాయంపై సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి ఉత్సవాలకు ముందే నిధులు మంజూరవుతాయి. కానీ ఈ ఏడాది ఉత్సవాలు ముగిసి పది రోజులైనప్పటికీ నిధులు విడుదలపై స్పష్టత లేకుండా పోయింది. ఈ ఏడాది మోదకొండమ్మ ఉత్సవాలకు రూ.2 కోట్లు విడుదల చేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. కానీ దానిపై ప్రభుత్వం నుంచి నేటికీ ఎటువంటి సమాచారం రాలేదు. ప్రతి ఏడాది మే నెలలో మూడు రోజుల పాటు స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ తరుణంలో ఉత్సవ కమిటీ భక్తుల నుంచి విరాళాలు సేకరించడంతోపాటు ప్రభుత్వం విడుదల చేసే సొమ్ముతో ఉత్సవాలు మరింత వైభవంగా జరుగుతాయి. అయితే గతేడాది ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. అలాగే ఈ ఏడాది నిధుల మంజూరుపై స్పష్టత లేకుండా పోయిందని భక్తులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో పెద్ద గిరిజన ఉత్సవాలుగా మోదకొండమ్మ పండుగ జరుగుతున్న విషయాన్ని గుర్తించిన గత తెలుగుదేశం ప్రభుత్వం, 2016లో రాష్ట్ర స్థాయి గిరిజన ఉత్సవాలుగా ’మోదకొండమ్మ పండుగ’ను గుర్తించింది. దీంతో ఉత్సవాలకు ప్రత్యేకంగా రూ.కోటి నిధులు విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఈ ఉత్సవాలకు నిధులు విడుదల చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. కానీ గత రెండేళ్లుగా ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు.