Share News

వెదురుకు పూర్వ వైభవం వచ్చేనా?

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:07 PM

ఏజెన్సీలో ఒకప్పుడు అటవీ శాఖకు కోట్లాది రూపాయల ఆదాయం, గిరిజనులకు ఉపాధి కల్పించిన వెదురు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయింది. నిధుల కొరత వలన పెంపకం తగ్గిపోయింది.

వెదురుకు పూర్వ వైభవం వచ్చేనా?
వెదురునగరం డిపోనకు తరలించేందుకు సిద్ధం చేసిన వెదురు కర్రలు

నిధుల కొరత వలన తగ్గిపోయిన చెట్ల పెంపకం

అటవీ శాఖకు తగ్గిన ఆదాయం

ఉపాధి కోల్పోతున్న గిరిజనులు

కొయ్యూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ఒకప్పుడు అటవీ శాఖకు కోట్లాది రూపాయల ఆదాయం, గిరిజనులకు ఉపాధి కల్పించిన వెదురు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయింది. నిధుల కొరత వలన పెంపకం తగ్గిపోయింది. దీనికి తోడు అసోం వెదురు తక్కువ ధరకు లభిస్తుండడంతో మార్కెట్‌లో గట్టి పోటీ నెలకొంది. దీంతో వెదురు సేకరణపై అటవీ శాఖ దృష్టి సారించడం తగ్గించింది. ఫలితంగా సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోయింది.

మన్యంలో పెదవలస, నల్లగొండ, కొండసంత, గంగవరం, సోలాబు, బూదరాళ్ల, మర్రిపాకల, యూ.చీడిపాలెం, ఆర్‌వీ నగర్‌, సీలేరు, తదితర ప్రాంతాల్లో వెదురు పెంపకం అధికంగా ఉండేది. ఇక్కడ లభించే వెదురు అసోం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో దృఢమైనది. దీంతో ఈ వెదురుకు ధర కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ నాణ్యత కోరుకునే వ్యాపారులు ఈ ప్రాంతాల వెదురుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ నేపథ్యంలో ఒకప్పుడు వెదురు విక్రయాల ద్వారా అటవీ శాఖకు ఏటా రూ.5 కోట్ల ఆదాయం వచ్చేది. అలాగే వందలాది మంది గిరిజనులకు నాలుగు నెలల పాటు వెదురు చెట్లు నరకడం ద్వారా ఉపాధి లభించేది. రెండు దశాబ్దాల క్రితం వరకు ఇక్కడ సేకరించిన వెదురు రాజమహేంద్రవరం పేపరుమిల్లు, రాయగడ జేకే పేపరు మిల్లుకు తరలించేవారు. అప్పట్లో పేపరు తయారీకి వెదురునే అధికంగా వాడడం, ఈ ప్రాంత వెదురు నాణ్యత పరంగా బాగుండడంతో మంచి గిరాకీ ఉండేది. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞానం పెరిగి వెదురుకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో సరుగుడు, సుబాబుల్‌, యూకలిప్టస్‌ వంటి ఇతర కలపలతో పేపరు తయారు చేస్తుండడంతో పేపరు మిల్లు యాజమాన్యాలు వెదురు కొనుగోలు నిలిపివేశారు. దీంతో అటవీశాఖ వెదురు పొంతల నిర్వహణ ఆపేసింది. గతంలో అటవీ ప్రాంత వెదురు కూపులలో వెదురు నరికిన అనంతరం అటవీశాఖ పర్యవేక్షణలో మొదళ్లు శుభ్రం చేసి మట్టిని దాని చుట్టూ సర్దేవారు. దీని వలన వెదురు పొదలు పిలకలు పెట్టడం, పొద విస్తరించడంతో పాటు లేత వెదురు ఏపుగా పెరిగేది. అయితే నిధుల కొరత కారణంగా ఈ నిర్వహణ పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు అసోం వెదురు తక్కువ ధరకు లభిస్తుండడంతో స్థానిక మార్కెట్‌లో గట్టి పోటీ నెలకొని వెదురు విక్రయాలపై ప్రభావం చూపింది. దీంతో వెదురు సేకరణపై అటవీశాఖ దృష్టి సారించడం తగ్గించింది. దీని వలన వెదురు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. చనిపోయిన వెదురు స్థానంలో కొత్తగా వెదురు మొక్కలు నాటకపోవడం వలన గతంతో పోలిస్తే రెండొంతుల విస్తీర్ణం తగ్గి సాధారణ అవసరాలకు కూడా వెదురు దొరకని పరిస్థితి నెలకొంది. వెదురు సాగును ప్రోత్సహించేందుకు మ్యాంగోవ్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా నడుంబిగించి అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, పోలవరం జిల్లాల్లో లక్షలాది వెదురు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నా ఫలితం ఉండడం లేదు. అయితే ఫర్నిచర్‌, నాణ్యమైన పేపరు తయారీ, బయో ఇంధనం, వస్త్ర పరిశ్రమల్లో వెదురుకు ప్రస్తుతం డిమాండ్‌ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి వెదురు సాగును ప్రోత్సహిస్తే అటవీ శాఖకు ఆదాయంతో గిరిజనులకు ఉపాధి లభిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 11:07 PM