పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటయ్యేనా?
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:14 PM
ఆంధ్ర కశ్మీరుగా గుర్తింపు పొందిన లంబసింగిలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. లంబసింగికి ఏటా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.
నాలుగేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పోలీస్ శాఖ
తాజంగిలో స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు
పట్టించుకోని గత వైసీపీ సర్కారు
ఇప్పటికీ కార్యరూపం దాల్చని వైనం
నెల రోజుల్లో ప్రారంభంకానున్న పర్యాటక సీజన్
చింతపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీరుగా గుర్తింపు పొందిన లంబసింగిలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. లంబసింగికి ఏటా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. పర్యాటక సీజన్లో దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ట్రాఫిక్ సమస్యతో పాటు మందుబాబులు, ఆకతాయిల ఆగడాల వల్ల కుటుంబ సమేతంగా వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. తాజంగిలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటుకు నాలుగేళ్ల క్రితం పోలీస్ శాఖ ప్రతిపాదనలు పంపినా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
లంబసింగికి ప్రతి ఏటా నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. మైదాన ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు మద్యం సేవిస్తూ విచ్చలవిడిగా డీజే సౌండ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఎక్కడబడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాల్లో లంబసింగి జంక్షన్ వద్ద గంటల తరబడి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు నిలిచిపోతున్నాయి. కొందరు మార్గమధ్యంలో మద్యం సేవిస్తూ స్థానికులు, పర్యాటకులను ఇబ్బంది పెడుతున్నారు.
పోలీస్ స్టేషన్ దూరంగా ఉండడంతో..
లంబసింగి, తాజంగి, చెరువులవేనం పర్యాటక ప్రాంతాలు చింతపల్లి పోలీసు స్టేషన్‌కు 20 నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీని వల్ల పోలీసు భద్రత కొరవడింది. ఈ నేపథ్యంలో గతంలో అప్పటి కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీగా పని చేసిన సతీశ్‌కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల క్రితం గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తాజంగి ప్రాంతంలో అవుట్‌పోస్టు ఏర్పాటుకు 20 సెంట్ల ప్రభుత్వ స్థలం కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వంలోనైనా ఇది కార్యరూపం దాలుస్తుందని భావించినా కదలిక లేదు. మరో నెల రోజుల్లో పర్యాటక సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి లంబసింగి ప్రాంతంలో పోలీస్ అవుట్‌పోస్టు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.