Share News

మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణం జరిగేనా?

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:17 PM

మండల పరిధిలో గల సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా సుమారు 20 గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు.

మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణం జరిగేనా?
నాటు పడవపై వెళుతున్న కుమ్మరిపుట్టు వాసులు (ఫైల్‌ ఫొటో)

నాలుగు సార్లు సర్వేలు చేసి మిన్నకున్న అధికారులు

రాకపోకలకు 20 గ్రామాల ప్రజల అవస్థలు

ముంచంగిపుట్టు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలో గల సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు సమీపంలో మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు మారుతున్నా సుమారు 20 గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. దీంతో ప్రమాదమని తెలిసినా మత్స్యగెడ్డను దాటేందుకు నాటు పడవలను ఉపయోగించాల్సిన దుస్థితి నెలకొంది.

మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో సుమారు 20కి పైగా గ్రామాల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఏ చిన్నపాటి అవసరానికైనా పంచాయతీ కేంద్రానికి వచ్చేందుకు నాటు పడవలనే ఉపయోగిస్తుంటారు. మత్స్యగెడ్డ పాయపై వంతెన నిర్మించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎన్నిసార్లు వినతులు అందించిన ఫలితం కానరావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సుజనకోట, కుమ్మరిపుట్టు సమీపంలో గెడ్డపై వంతెన నిర్మాణానికి సుమారు నాలుగు సార్లు సర్వేలు చేశారు. ఆ తరువాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వర్షం కురిస్తే వరద నీరు ఉధృతంగా ప్రవహించి పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు ఉండదు. పలుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మత్స్యగెడ్డపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.

Updated Date - Jun 07 , 2026 | 11:17 PM