Share News

వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:40 AM

రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు అవసరమైతే చట్టంలో సవరణలు చేస్తామని ఏపీ శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ

విశాఖ జూ పార్కు సమగ్ర అభివృద్ధి

ఖాళీ పోస్టుల భర్తీ...నిధుల సమీకరణ

ఏపీ శాసనసభ స్పీకర్‌ చింతకాయ అయ్యన్నపాత్రుడు

జంతుప్రదర్శనశాలను సందర్శించిన శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు అవసరమైతే చట్టంలో సవరణలు చేస్తామని ఏపీ శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్‌, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత తరుణంలో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఈ కమిటీ సభ్యులు మంగళవారం విశాఖలో జంతు ప్రదర్శనశాల (జూ), కంబాలకొండ తదితర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో అటవీ, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ఇది అత్యంత ప్రాధాన్యం కలిగిన కమిటీ అని పేర్కొన్నారు. కమిటీ సూచనలతో పాటు అధికారులు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణను సమర్థవంతతమైన విధానాన్ని అమలులోకి తీసుకువస్తామన్నారు. దీనికి సమగ్ర కార్యాచరణతో పాటు అవసరమైతే చట్టాల్లో మార్పులు చేస్తామన్నారు. సంస్కరణలు తెస్తామన్నారు. మేధోపరమైన చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు అవసరమన్నారు. కంబాలకొండ అభయారణ్యం, విశాఖ జూ, జంతు సంరక్షణ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించి అనేక అంశాలను తెలుసుకున్నామన్నారు. మౌలిక వసతులు, సిబ్బంది అవసరాలు, సందర్శకులకు సౌకర్యాలు, ఇంకా చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక తయారు చేస్తామన్నారు. 23 వేల ఎకరాల్లో విస్తరించిన కంబాలకొండ అభయారణ్యాన్ని కాపాడుకోవలసి ఉందన్నారు. విశాఖ జూ నిర్వహణకు ఏడాదికి కనీసం రూ.10 కోట్లు అవసరమన్నారు. ఆదాయం పెంచేందుకు అధికారులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలన్నారు. ఉత్తరాంధ్ర ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా ఏటా రూ.3 కోట్ల నిధులు సమీకరించే బాధ్యత తీసుకుంటానన్నారు. జూలో 81 మంజూరు పోస్టులు ఉండగా, వాటిలో 59 ఖాళీగా ఉన్నాయన్నారు. 1,404 జంతువుల సంరక్షణకు కేవలం ఒక పశు వైద్యుడు, ఒక సహాయకుడు మాత్రమే ఉన్నారన్నారు. ఇవన్నీ నివేదికలో పొందుపరుస్తామన్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జూ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు సమీకరించాలని సూచించారు. బ్యాంకులు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తామన్నారు. కమిటీ సభ్యుడు నరేంద్రవర్మ మాట్లాడుతూ విశాఖ, తిరుపతి జూలను దేశంలో ఆదర్శవంతమైన జూలుగా అభివృద్ధి చేయాలన్నారు. మరో సభ్యుడు గోండు శంకరరావు మాట్లాడుతూ కంబాలకొండ అభయారణ్యాన్ని జూ పార్కుతో అనుసంధానం చేస్తూ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాలన్నారు. పాలవలస విక్రాంత్‌ మాట్లాడుతూ బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. విశాఖ కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మాట్లాడుతూ సీఎస్‌ఆర్‌ ద్వారా రూ.3 కోట్లు సమీకరిస్తామన్నారు. ఈ సమావేశంలో చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ కాశీ విశ్వనాథరాజు, అసెంబ్లీ కార్యదర్శి ప్రసన్నకుమార్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ తేజ్‌ భరత్‌, డీఎఫ్‌ఓ రవీందర్‌ దామా, జూ క్యూరేటర్‌ మంగమ్మ, డీఆర్‌ఓ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:40 AM