ఆందోళనలపై విస్తృత ప్రచారం
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:25 AM
గిరిజన హక్కుల సాధన కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఆందోళనలు చేపట్టాలని పలు గిరిజన సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
7న పాడేరులో అరణ్య గర్జన ర్యాలీ, 8న మన్యం బంద్ నిర్వహించాలని గిరిజన సంఘాల నిర్ణయం
గ్రామాల్లో పర్యటిస్తున్న ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు
పాడేరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): గిరిజన హక్కుల సాధన కోసం ఈ నెల 7, 8 తేదీల్లో ఆందోళనలు చేపట్టాలని పలు గిరిజన సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గిరిజనులకు శత శాతం రిజర్వేషన్ చట్టం రూపొందించాలని, 1/70 చట్ట పరిరక్షణకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 7న పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే 7న నిర్వహించే అరణ్య గర్జన ర్యాలీని విజయవంతం చేయాలని సీపీఎం, సీపీఎం నేతలు, గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య నేతలు కోరుతున్నారు. జీవో:3 పునరుద్ధరణ, 1/70 చట్టం పరిరక్షణపై ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న మన్యం బంద్ నిర్వహించాలని గిరిజన సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
ఆందోళనలు, ర్యాలీలకు అనుమతి లేదు
జిల్లాలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో ఆందోళనలు, ర్యాలీలు, సభలు వంటి వాటికి ఎటువంటి అనుమతి లేదని ఎస్‌పీ అమిత్‌బర్దార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7, 8, 9 తేదీల్లో ర్యాలీలు, బంద్‌లు చేపడతామని కొందరు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, అటువంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. అలాగే పోలీసుల అనుమతి లేకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేలా ఎటువంటి ఆందోళనలు చేపట్టినా వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌పీ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు.