Share News

కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌పై ఎందుకీ నిర్లక్ష్యం?

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:29 PM

మండలంలోని చిన్నగెడ్డ కాఫీ ఎస్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ఏర్పాటు చేసిన కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌(పార్కు) నిర్లక్ష్యానికి గురైంది.

కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌పై ఎందుకీ నిర్లక్ష్యం?
కళావిహీనంగా తయారైన కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ ప్రవేశ ద్వారం

నిర్వహణను గాలికొదిలేసిన ఏపీఎఫ్‌డీసీ అధికారులు

శిథిలమైన బర్డ్‌నెస్ట్‌

కళావిహీనంగా పార్కు

చింతపల్లి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్నగెడ్డ కాఫీ ఎస్టేట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ఏర్పాటు చేసిన కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌(పార్కు) నిర్లక్ష్యానికి గురైంది. ప్రజాదరణ ఉన్నప్పటికి ఏపీఎఫ్‌డీసీ అధికారులు ఏడాది కాలంగా పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. దీంతో ఇక్కడికి రావడానికి పర్యాటకులు ఆసక్తి చూపడం లేదు.

చిన్నగెడ్డ ఎస్టేట్‌ పరిధిలో ఏపీఎఫ్‌డీసీ అధికారులు ప్రకృతి అందాలు, కాఫీ తోటలను పర్యాటకులకు పరిచయం చేసేందుకు కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌(పార్కు)ను గత ఏడాది ఏర్పాటు చేశారు. కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌లో సందర్శకుల కోసం బర్డ్‌ నెస్ట్‌, ఉడెన్‌ ట్రీ డెక్‌, మచన్‌ ఏర్పాటు చేశారు. లంబసింగి సందర్శనకు వచ్చిన పర్యాటకులు అధిక సంఖ్యలో కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ను సందర్శించేవారు. ఉడెన్‌ బ్రిడ్జి, బర్డ్‌ నెస్ట్‌ వద్ద ఫొటో షూట్‌ చేసుకునేవారు. కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ జాతీయ రహదారికి ఆనుకుని వుండడంతో ఈ మార్గంలో ప్రయాణించే పర్యాటకులు, ప్రజలు ఇక్కడ కొంత సమయం వెచ్చించి ఫొటోలు తీసుకుని వెళ్లేవారు. తొలుత ఏపీఎఫ్‌డీసీ అధికారులు ప్రవేశానికి నామమాత్రపు రుసుము పెట్టారు. పర్యాటక సీజన్‌లో అత్యధిక సంఖ్యలో పర్యాటకులు కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ను సందర్శించారు. సీజన్‌ ముగియడంతో ఏపీఎఫ్‌డీసీ అధికారుల పర్యవేక్షణ, నిర్వహణ లేకుండాపోయింది. ప్రస్తుతం ఉడెన్‌ డెక్‌ మాత్రమే వినియోగంలో ఉంది. బర్డ్‌నెస్ట్‌ పూర్తిగా శిథిలమైపోయింది. దీంతో బర్డ్‌నెస్ట్‌ వద్ద కూర్చోవడానికి, ఫొటోలు తీసుకునేందుకు వీలుపడడం లేదు. ప్రవేశ ద్వారం, ట్రెక్కింగ్‌ పాత్‌ పూర్తిగా పాడైపోయింది. ప్రస్తుతం కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ కళావిహీనంగా మారింది. దీని వలన కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. మందుబాబులు మద్యం సేవించేందుకు ఉడెన్‌ డెక్‌ని వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా ఏపీఎఫ్‌డీసీ అధికారులు స్పందించి కాఫీ బెర్రీ పికింగ్‌ టూర్‌లో బర్డ్‌నెస్ట్‌ను పునరుద్ధరించడంతో పాటు అదనపు సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Oct 18 , 2026 | 11:29 PM