Share News

పద్మాపురం గార్డెన్‌పై ఎందుకీ నిర్లక్ష్యం?

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:28 PM

ప్రముఖ పర్యాటక కేంద్రం పద్మాపురం గార్డెన్‌లో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పద్మాపురం గార్డెన్‌పై ఎందుకీ నిర్లక్ష్యం?
అసంపూర్తిగా ఉన్న వాటర్‌ ఫౌంటైన్‌

రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినా పూర్తికాని వైనం

అడుగడుగునా అసంపూర్తి నిర్మాణాలు దర్శనం

రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతామని చెప్పినా సాయంత్రం 5 గంటలకే మూసివేత

సౌకర్యాలపై పర్యాటకుల అసంతృప్తి

అరకులోయ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక కేంద్రం పద్మాపురం గార్డెన్‌లో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ ఇంకా అసంపూర్తి నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి. రాత్రి 9 గంటల వరకు పర్యాటకుల సందర్శనకు అనుమతి ఇచ్చేందుకు అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ లక్ష్యం నెరవేరలేదు. ఎప్పటిలాగానే సాయంత్రం 5 గంటలకు గార్డెన్‌ను మూసివేస్తున్నారు. దీంతో పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పర్యాటకులను ఆకర్షించేలా పద్మాపురం గార్డెన్‌ను తీర్చిదిద్దాలని గత ఏడాది అప్పటి ఐటీడీఏ పీవో అభిషేక్‌ రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఆ సమయంలో గార్డెన్‌ను మూసివేశారు. అయితే పనులు పూర్తికాకపోయినా గత ఏడాది అరకు ఉత్సవ్‌ కోసం గార్డెన్‌ను పునఃప్రారంభించారు. ఆ తరువాత అభిషేక్‌ బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి పనులు పడకేశాయి. వాస్తవానికి గార్డెన్‌ అంతటా పాత్‌వేకు, వృక్షాలకు రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. బేంబూ ట్రీల మధ్య ఉడెన్‌ బ్రిడ్జి నిర్మించారు. ఎరుపు రంగులో సినిమా సెట్టింగ్‌ను తలపించేలా పలు రకాల ఆకృతులను ఏర్పాటు చేశారు. అయితే వాటికి ఇప్పటికీ విద్యుద్దీప అలంకరణ చేయలేదు. అలాగే త్రీడీ లైటింగ్‌లో పలు రకాల జంతువుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. కాగా వాటర్‌ ఫౌంటైన్‌ నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. పాత్‌వేలకు టైల్స్‌ను సక్రమంగా అమర్చలేదు. టాయ్‌ట్రైన్‌ మూలకు చేరినా వినియోగంలోకి తీసుకురాలేదు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ఎగరడానికి అనుకూలంగా బలమైన గాలులు వీచే సమయంలో గార్డెన్‌ను మూసివేస్తున్నారని, దీని వలన నష్టపోతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. అలాగే రోజ్‌ గార్డెన్‌లో బటర్‌ఫ్లై ఆకారాన్ని అరకొరగా నిర్మించి వదిలేశారు. ఇలా చాలా అసంపూర్తి పనులు దర్శనమిస్తున్నాయి. ఐటీడీఏ పీవో శ్రీపూజ స్పందించి ఈ అభివృద్ధి పనులు పూర్తి చేయించి రాత్రి 9 గంటల వరకు గార్డెన్‌ను సందర్శించేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 11:28 PM