Share News

అసెంబ్లీకి రాకుంటే జీతం ఎందుకు?

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:19 AM

‘ఉద్యోగి విధులకు రాకపోతే సస్పెండ్‌ చేస్తున్నాం. జీతం ఆపుతున్నాం. అలాంటప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకివ్వాలి.

అసెంబ్లీకి రాకుంటే జీతం ఎందుకు?

నో వర్క్‌, నో పే సిద్ధాంతం తీసుకురావాలి

స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు

మద్దిలపాలెం, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):

‘ఉద్యోగి విధులకు రాకపోతే సస్పెండ్‌ చేస్తున్నాం. జీతం ఆపుతున్నాం. అలాంటప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకివ్వాలి. ఎందుకు సస్పెండ్‌ చేయకూడదు. దీనిపై ఆలోచన చేయాలి. నో వర్క్‌, నో పే సిద్ధాంతాన్ని తీసుకురావాలి. అప్పుడే ఈ తరం కాకపోయినా, తర్వాత తరాలకు ఒక గుణపాఠంగా ఉంటుంది’...అని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. నగరంలోని పిఠాపురం కాలనీలో గల కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహానేతలు ఎన్టీఆర్‌, ఇందిరాగాంధీ వంటి వారే ఓటమి పాలయ్యారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అలాంటి వారిని చూసి నేర్చుకోవాలన్నారు. గెలుపు, ఓటములు ప్రజా నిర్ణయమన్నారు. గెలిచాక రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప...గొడవలు సృష్టించడానికి కాదన్నారు. ప్రజా సమస్యలు మాట్లాడాలంటే అసెంబ్లీకి రావాలని, బయట ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదన్నారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెబుతారని, వారు చెప్పకపోతే తాను చెప్పిస్తానని చెప్పారు. బయట తిరుగుతూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయకుండా, అసెంబ్లీకి రండి ఎంత సమయం కావాలో అంత సమయం ఇస్తాను, అక్కడ మాట్లాడండని...అంటూ పరోక్షంగా జగన్‌కు సూచించారు.


ఉక్కు సీఎండీ ఎంపికకు నోటిఫికేషన్‌

ఈసారైనా కొత్త అధికారికి బాధ్యతలు అప్పగిస్తారా?

గతంలో పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విభాగం

సెలక్ట్‌ చేసిన శక్తిమణిని పక్కనపెట్టి వేరొకరికి అదనపు బాధ్యతలు

ఆయన పదవీకాలం ముగియడంతో ఇన్‌చార్జిగా సెయిల్‌ డైరెక్టర్‌ మనీశ్‌రాజ్‌ గుప్తా

విశాఖపట్నం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటుకు కొత్త చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)ను నియమించడానికి సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విభాగం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ బాధ్యతను సెర్చ్‌ కమ్‌ సెలక్షన్‌ కమిటీకి అప్పగించింది. ఈసారైనా పూర్తిస్థాయి సీఎండీకి బాధ్యతలు అప్పగిస్తారా?, లేదా?...అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్టీల్‌ ప్లాంటుకు ప్రస్తుతం సెయిల్‌ డైరెక్టర్‌ మనీశ్‌రాజ్‌ గుప్తా ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకు మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఓఐఎల్‌) చైర్మన్‌ ఏకే సక్సేనా ఇన్‌చార్జి చైర్మన్‌గా 15 నెలలు పనిచేశారు. వాస్తవానికి అతుల్‌భట్‌ సీఎండీగా ఉండగా 2024లోనే కొత్త సీఎండీ కోసం ప్రకటన ఇచ్చారు. ‘ది ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌’లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శక్తిమణిని ఎంపిక చేశారు. అతుల్‌భట్‌కు ఇంకా రెండు నెలల పదవీ కాలం ఉండగానే పనితీరు బాగా లేదని 2024 సెప్టెంబరులో పంపించేశారు. ఆ స్థానంలో శక్తిమణిని నియమించాల్సి ఉంది. కానీ ఇక్కడే ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఏకే బాగ్చీకి సీఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన సీఎండీ సీట్లో కూర్చొని 20 రోజులు కాక ముందే...ఎంఓఐఎల్‌ నుంచి ఏకే సక్సేనాను తీసుకువచ్చారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన సీఎండీ ఉండగా ఇలా ఎప్పుడూ వేరొకరిని నియమించలేదు. అడ్డగోలుగా వచ్చిన ఏకే సక్సేనా తన పదవీకాలం పూర్తయ్యే వరకు 2025 డిసెంబరు వరకూ ఇక్కడే కొనసాగారు. ఎంపికైన శక్తిమణిని పూర్తిగా పక్కన పెట్టేశారు. సక్సేనా వెళ్లిపోయాక సెయిల్‌ డైరెక్టర్‌ మనీశ్‌ రాజ్‌ గుప్తాకు బాధ్యతలు అప్పగించారు. ఈలోగా శక్తిమణి నియామకపు గడువు ముగిసిపోవడంతో ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆసక్తి కలిగినవారు మార్చి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పుడైనా నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన అధికారిని నియమిస్తారా?, లేదంటే ఇన్‌చార్జితోనే నెట్టుకొస్తారా?....అని ఉద్యోగ వర్గాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.

Updated Date - Feb 07 , 2026 | 01:19 AM