Share News

అభివృద్ధి పనులు ఎందుకు ఆపేశారు?

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:54 AM

మునిసిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై చైర్‌పర్సన్‌ చింతకాయల పద్మావతి గురువారం తన చాంబర్‌లో మునిసిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు.

అభివృద్ధి పనులు ఎందుకు ఆపేశారు?
మునిసిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమైన చైర్‌పర్సన్‌ పద్మావతి

అధికారులు, కాంట్రాక్టర్లను నిలదీసిన మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి

పైపులైన్‌ పనులు త్వరగా పూర్తిచేసి, రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశం

నర్సీపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై చైర్‌పర్సన్‌ చింతకాయల పద్మావతి గురువారం తన చాంబర్‌లో మునిసిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మునిసిపాలిటీలో 301 పనులు ప్రారంభించి ఆపేశారని, ఎందుకు ఇలా జరిగిందని నిలదీశారు. నిలిచిపోయిన పనులు ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎన్‌సీసీ సంస్థ నర్సీపట్నంలో రూ.186 కోట్లతో మెగా తాగునీటి ప్రాజెక్టు పనులు చేపట్టిందని, నీటి సరఫరా పైపులైను 164 కిలోమీటర్లు వేయాల్సి వుండగా ఇంతవరకు 80 కిలోమీటర్లు మాత్రమే వేశారని అన్నారు. పైపులైను పనులు పూర్తి చేస్తే తప్ప కొత్తగా రోడ్లు వేయడం వీలు పడదని ఆమె పేర్కొన్నారు. అందువల్ల పైపులైను ఏర్పాటు పనులను త్వరగా పూర్తిచేసి, రోడ్ల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు, కాంట్రాక్టర్లు చెప్పినట్టు ఆమె వెల్లడించారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని రోడ్ల పనులను పునరుద్ధరిస్తామని సంబంధిత కాంట్రాక్టర్‌ చెప్పారని అన్నారు. ఉత్తరవాహిని వద్ద కల్యాణ మండపం, పెదబొడ్డేపల్లి పెద్దచెరువు వాకింగ్‌ ట్రాక్‌ పనులు కూడా మొదలు పెట్టి త్వరగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించామని తెలిపారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడుతో మాట్లాడి లైటింగ్‌ పనులు కూడా ప్రారంభిస్తామని చైర్‌పర్సన్‌ చెప్పారు. తెలిపారు. సమావేశంలో మునిసిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, డీఈఈ కామేశ్వరరావు, ప్రజారోగ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 01:54 AM