టెన్త్ ఫలితాలెందుకు ఇలా వచ్చాయి?
ABN , Publish Date - May 03 , 2026 | 12:35 AM
జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలిలాలు ఎందుకు ఇలా వచ్చాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి విద్యాశాఖాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో టెన్త్ ఫలితాలు నిరాశపరచడంతో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సైతం విద్యాశాఖాధికారులతో ఆమె ప్రత్యేకంగా సమాశమై ఫలితాలు దిగజారడంపై సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ నిషాంతి తీవ్ర అసంతృప్తి
రెండు రోజులు సమీక్షించిన కలెక్టర్
వంద రోజుల కార్యాచరణ అమలు చేస్తే
ఫలితాలు ఎందుకు రాలేదని సూటి ప్రశ్న
బాగా లేని పాఠశాలల్లో ప్రత్యేక ప్రణాళికలు
పక్కాగా అమలు చేయాలని ఆదేశం
ఇటువంటి పరిస్థితులు పునరావృతమైతే
కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
పాడేరు, మే 2(ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి ఫలిలాలు ఎందుకు ఇలా వచ్చాయని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి విద్యాశాఖాధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లాలో టెన్త్ ఫలితాలు నిరాశపరచడంతో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం సైతం విద్యాశాఖాధికారులతో ఆమె ప్రత్యేకంగా సమాశమై ఫలితాలు దిగజారడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... టెన్త్ విద్యార్థుల కోసం వంద రోజుల విద్యాప్రణాళిక అమలు చేస్తే? చక్కని ఫలితాలు ఎందుకు రాలేదన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నప్పటికీ.. ఎందుకు ఆశించిన ఫలితాలు రాలేదని ప్రశ్నించారు. ఈఏడాది ఫలితాలు బాగాలేని పాఠశాలల్లో పరిస్థితులను గుర్తించి, వచ్చే ఏడాది చక్కని ఫలితాలు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం, వెనుకబడి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం, శత శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయడం మఖ్యమన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో టెన్త్ ఎంతో ముఖ్యమని, అక్కడే విఫలం కావడం సరికాదని, ఇకపై అటువంటి పరిస్థితులు పునరావృతమైతే అందుకు బాధ్యులైన విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ నిషాంతి హెచ్చరించారు. మెరుగైన విద్యాబోధన కొనసాగించాలని, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థిలో పఠనాసక్తిని పెంచాలన్నారు. పాఠశాల ప్రధానోధ్యాయులు ముందుస్తుగానే యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుని అమలు చేయాలని, అధికారులు విధిగా నిత్యం పర్యవేక్షించి, ప్రతివారం విద్యపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. టెన్త్ తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీలోనైనా పాస్ అయ్యేలా బోధన సాగించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు చేపట్టేందుకు వెనుకాడనని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే.పరిమిళ, గిరిజన గురుకులాల కన్వీనర్ పీఎస్‌ఎన్.మూర్తి, డిప్యూటీ డీఈవో చెల్లయ్య, జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులు, ఏటీడబ్ల్యూవోలు, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.