గెలుపుపై ఎవరి ధీమా వారిది!
ABN , Publish Date - Nov 06 , 2026 | 11:04 PM
జిల్లాలోని పరిషత్ ఎన్నికల్లో ఊహించిన దాని కంటే ఎక్కువగానే పోలింగ్ (62 శాతం) జరగడంతో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమకే అధిక స్థానాలు దక్కుతాయని భావిస్తున్న కూటమి, వైసీపీ నేతలు
జడ్పీ చైర్మన్ పీఠంపై అందరి కన్ను
ఎంపీపీ పదవులపైనా ఆశలు
ఉత్కంఠగా మారిన ఫలితాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని పరిషత్ ఎన్నికల్లో ఊహించిన దాని కంటే ఎక్కువగానే పోలింగ్ (62 శాతం) జరగడంతో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 11 జడ్పీటీసీ స్థానాలకు 70 మంది, 172 ఎంపీటీసీ స్థానాలకు 648 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల వారీగా తమ అభ్యర్థులకు ఎన్నెన్ని ఓట్లు దక్కుతాయనే లెక్కల్లో కూటమి, వైసీపీ పార్టీలున్నాయి. ఎవరికి వాళ్లు తమ అభ్యర్థే గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రాజీకీయపరంగా వార్డు సభ్యుడు మొదలు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీ సైతం వైసీపీకి చెందిన వాళ్లే కావడంతో తమకే అధికంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు దక్కుతాయని వైసీపీ నేతలు అంటున్నారు. రెండున్నరేళ్లలో కూటమి పాలనలో జిల్లాలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు మునిసిపల్ ఎన్నికల్లోనూ కూటమి ఊహించని విజయం సాధించడంతో దాని ప్రభావంతో ఈ దపా ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధికంగానే విజయం సాధిస్తారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అంటున్నారు. పాడేరు అసెంబ్లీ స్థానంలోని ఐదు మండలాల్లో నాలుగు జడ్పీటీసీ స్థానాలు సొంతం చేసుకుంటామని కూటమి భావిస్తుండగా, ఐదు స్థానాలు తామే గెలుచుకుంటామని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అరకులోయ అసెంబ్లీ స్థానంలో ఆరు జడ్పీటీసీ స్థానాల్లోనూ పాగా వేస్తామని వైసీపీ పేర్కొంటుండగా, నాలుగు స్థానాలు గెలుస్తామని కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 172 ఎంపీటీసీ స్థానాల్లో 150 స్థానాల్లో విజయం సాధిస్తామని వైసీపీ నేతలు భావిస్తుండగా, 80 స్థానాలు తమకు దక్కుతాయని కూటమి పార్టీలు అంచనాలు వేస్తున్నారు.
అందరి దృష్టి జడ్పీ చైర్మన్ పీఠంపైనే
కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై అందరి దృష్టి పడింది. జిల్లాలోని మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు 6 స్థానాలు ఏ పార్టీకి దక్కితే, జడ్పీ చైర్మన్ పదవి వాళ్లకే సొంతమవుతుంది. ఈ తరుణంలో జిల్లాలోని ఎక్కువ జడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతోనే కూటమి, వైసీపీ, ఇతర పార్టీలు ఎన్నికల్లో చురుగ్గా పావులు కదిపారు. పోలింగ్ సైతం సజావుగా జరగడంతో తమకే ఓటర్ల మద్దతు లభించిందని, అధిక సంఖ్యలో జడ్పీటీసీ స్థానాలను దక్కించుకుని జడ్పీ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంటామని కూటమి, వైసీపీ నాయకులు ధీమాగా ఉన్నారు.