Share News

గ్రేటర్‌లో గెలుపెవరిదో...

ABN , Publish Date - Nov 03 , 2026 | 01:56 AM

జీవీఎంసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

గ్రేటర్‌లో గెలుపెవరిదో...

  • నేడే ఓట్ల లెక్కింపు

  • ఇరుపక్షాల్లోనూ ఉత్కంఠ

విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మేయర్‌గా ఎవరు గెలుస్తారు...కార్పొరేటర్లుగా ఎవరెవరు ఎన్నికవుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు...ఎవరికి వారు గెలుపుపై పైకి ధీమా వ్యక్తంచేస్తున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందోనని లోలోన ఆందోళనకు గురవుతున్నారు.

జీవీఎంసీ ఎన్నికలకు గత నెల 14న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. మేయర్‌ పదవికి కూటమి నుంచి ముక్కా శ్రావణి, వైసీపీ నుంచి వరుదు కళ్యాణితోపాటు మరో 13 మంది పోటీకి నిలవగా, 120 వార్డులకు కార్పొరేటర్లుగా 573 మంది బరిలోకి దిగారు. జీవీఎంసీ పరిధిలో 18,37,901 మంది ఓటర్లు ఉండగా, ఆదివారం జరిగిన పోలింగ్‌లో కేవలం 10,35,154 మంది (56.32 శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ఏర్పాటుచేసిన స్ర్టాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. మంగళవారం ఉదయం పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ శాతం తక్కువగా నమోదవ్వడం తమకు అనుకూలమని ఇరుపక్షాలు ధీమా వ్యక్తంచేస్తుండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విద్యావంతుల ఓట్లు కూటమి అభ్యర్థులకే పడతాయని రాజకీయ విశ్లేషకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. వార్డుల విషయానికి వస్తే కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ కొనసాగినప్పటికీ, కొన్నిచోట్ల కూటమి నుంచి రెబల్స్‌ స్వతంత్రులుగా పోటీకి నిలవడంతో అక్కడ ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఏదిఏమైనా మంగళవారం సాయంత్రానికి జీవీఎంసీ మేయర్‌ ఎవరనే దానితోపాటు ఏ పార్టీ ఎన్ని వార్డులను దక్కించుకుందనేది తేలిపోనుంది.


కౌంటింగ్‌కు వేళాయె

ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి

113 హాళ్లలో 1,507 టేబుళ్లు

ఐదు వేల మంది సిబ్బంది నియామకం

ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపుతో ప్రారంభం

ముందుగా కార్పొరేటర్‌ ఓట్లు, తర్వాత మేయర్‌ ఓట్లు లెక్కింపు

రెండు రౌండ్‌లలో తుది ఫలితం తేలే అవకాశం

జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్టు జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలోని నార్త్‌ క్యాంపస్‌, సౌత్‌ క్యాంపస్‌లోని ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, సీపీ శంఖబ్రతబాగ్చితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్‌ కాలేజీ అడ్మినిస్ట్రేషన్‌ బ్లాక్‌ వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే ముఖ్య అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏయూ నార్త్‌ క్యాంపస్‌లోని ఎనిమిది బ్లాక్‌లు, సౌత్‌ క్యాంపస్‌లోని రెండు బ్లాకుల్లో 113 కౌంటింగ్‌ హాళ్లను ఏర్పాటుచేశామన్నారు. వాటిల్లో 1,507 టేబుళ్లను, లెక్కింపు కోసం ఐదు వేల మంది సిబ్బందిని సిద్ధం చేశామన్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది అంతా ఉదయం ఐదు గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఉదయం ఆరు గంటలకు అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో స్ర్టాంగ్‌ రూమ్‌లను తెరవాలని స్పష్టంచేశారు. బ్యాలెట్‌ బాక్స్‌లను కౌంటింగ్‌ హాళ్లకు తరలించి ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరిచినప్పటి నుంచి లెక్కింపు పూర్తయి ఫలితాలు ప్రకటించేంత వరకూ జోనల్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, నోడల్‌ అధికారులు, కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు నిరంతరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి బ్లాక్‌కు ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటుచేయాలని, వాటిపై ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బందికి ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రానికి 500 మీటర్ల దూరంలో వాహనాలను నిలిపేసి నడుచుకుంటూ లోపలకు రావాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపులో అనుమానాలకు తావులేకుండా వ్యవహరించాలని ఆదేశించారు. ఒక్కో వార్డు ఫలితం గరిష్ఠంగా రెండు రౌండ్లలో తేలిపోయే అవకాశం ఉందని, ఎప్పటికప్పుడు వాటిని మీడియాకు వెల్లడించాలని స్పష్టంచేశారు. ముఖ్య అధికారులు తప్ప, మిగిలిన అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు కూడా తమ సెల్‌ఫోన్‌లను నిర్దేశిత కౌంటర్‌లో డిపాజిట్‌ చేసి లోపలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. సెల్‌ఫోన్‌లను కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించే ప్రసక్తే లేదని కలెక్టర్‌ తెలిపారు. సీపీ శంఖబ్రతబాగ్చి మాట్లాడుతూ రిటర్నింగ్‌ అధికారి అనుమతి కలిగిన వారినే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుతిస్తామన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లో డ్రోన్‌లతో నిఘా పెడతామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లు ఇష్టానుసారంగా లోపలకు వెళ్లి, బయటకు రావడాన్ని అనుమతించబోమన్నారు.


ఒక్క రౌండ్‌లోనే తేలనున్న వార్డుల ఫలితాలు

మొదటి ఫలితం 105వ వార్డు

చివరిగా ఆరు, ఏడు వార్డులవి...

విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలోని నార్త్‌, సౌత్‌ క్యాంపస్‌లలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అత్యల్పంగా ఓటింగ్‌ జరిగిన 105వ వార్డు ఫలితం మొదట వెలువడనుంది. ఆ వార్డులో కేవలం 2,489 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అత్యధిక ఓట్లు పోలైన ఆరు, ఏడు వార్డుల ఫలితాలు ఆఖరులో వచ్చే అవకాశం ఉంది. ఆరో వార్డులో 14,256 ఓట్లు, ఏడో వార్డులో 13,173 ఓట్లు పోలయ్యాయి. వార్డుల ఫలితాలు తేలిన తర్వాత మేయర్‌ ఫలితాలను ప్రకటించనున్నారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా...

- వార్డుకు ఒకటి చొప్పున, చిన్న వార్డులైతే రెండింటికి ఒకటి చొప్పున 120 వార్డులకు 113 కౌంటింగ్‌ హాళ్లు సిద్ధం చేశారు. ఒక్కో హాలులో లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణకు ఒక రిటర్నింగ్‌ అధికారి ఉంటారు. పోలైన ఓట్లను బట్టి ఒక్కో హాలులో ఐదు నుంచి 15 వరకు టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌తోపాటు ఇద్దరు సిబ్బంది ఉంటారు. ఇలా మొత్తం 1,507 టేబుళ్లపై 7,177 మంది సిబ్బంది లెక్కింపు చేపడతారు.

- రిటర్నింగ్‌ అధికారి వద్ద అభ్యర్థులతోపాటు ఒక కౌంటింగ్‌ ఏజెంట్‌ ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇతర ఏజెంట్లు పక్కన ఉండి లెక్కింపు ప్రక్రియను పరిశీలించాల్సి ఉంటుంది.

- ముందుగా పోటీ చేసిన అభ్యర్థులు, కౌంటింగ్‌ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను లెక్కింపు హాలులోకి తీసుకువస్తారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓట్లను బాక్సుల్లో నుంచి టేబుల్‌పై వేస్తారు. 25 బ్యాలెట్లు చొప్పున కట్టలు కడతారు.

- వార్డు పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్లను కట్టలుగా కట్టిన అనంతరం ఒక డ్రమ్ములో వేసి కలుపుతారు. దీనివల్ల ఏ పోలింగ్‌ కేంద్రంలో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది తెలిసేందుకు అవకాశం ఉండదు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు రెండున్నర గంటల నుంచి మూడు గంటలు సమయం పడుతుంది. ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది.

- ముందుగా కౌంటింగ్‌ రోజు ఉదయం ఎనిమిది గంటల వరకూ పోస్టులో వచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను ఒక రౌండ్‌గా గుర్తించి లెక్కిస్తారు.

- అనంతరం డ్రమ్ములో వేసిన కట్టల్లో 40 కట్టలు (వెయ్యి ఓట్లు) ఒక టేబుల్‌కు ఇస్తారు. అంటే 12 టేబుళ్లకు 12 వేల బ్యాలెట్లు ఇస్తారు. దీనిని ఒక రౌండ్‌గా పరిగణిస్తారు. ఈ లెక్కన తొలి రౌండ్‌లోనే వంద వార్డుల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

- ఒక్కో కట్టను విప్పి సిబ్బంది ఒక్కో బ్యాలెట్‌ను తీసి ఏజెంట్లకు చూపించి అభ్యర్థుల గుర్తులకు పడిన ఓట్లు ఆధారంగా రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో ఆ గుర్తు ఉన్న ట్రేలో వేస్తారు. ఏదైనా అభ్యంతరం ఉంటే ఆ బ్యాలెట్‌ను ఒక ట్రేలోనూ, నోటాకు వచ్చే ఓట్లను ఒక ట్రేలో వేస్తారు. ఇలా అన్ని బ్యాలెట్లను వేరుచేయడం పూర్తయిన తర్వాత అభ్యర్థులకు పడిన బ్యాలెట్లను 50 చొప్పున కట్టలు కడతారు. అనంతరం లెక్కింపు పూర్తిచేస్తారు.

- మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత విజేతను ప్రకటిస్తారు. ఏదైనా బ్యాలెట్‌కు వేసిన ఓటు గుర్తు(స్వస్తిక్‌)పై ఏజెంట్లకు అభ్యంతరం ఉంటే టేబుల్‌ సూపర్‌వైజర్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారి దృష్టికి తీసుకువెళితే పరిశీలించి నిర్ణయం ప్రకటిస్తారు.

- కార్పొరేటర్‌ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మిగిలిన టేబుళ్లపై మేయర్‌ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలు కూడా ఇదే మాదిరిగా వేరుచేసి లెక్కిస్తారు. కార్పొరేటర్‌ ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించి, మేయర్‌ ఫలితాలను మాత్రం చివరగా ప్రకటిస్తారు.


కూటమిలో గెలుపు ధీమా

మెజారిటీపైనే ఆందోళన

80 వార్డులకుపైగా గెలుచుకుంటామని నాయకుల ప్రకటనలు

వైసీపీలో ఎక్కడో ఆశ

రెబల్స్‌లో గట్టెక్కేదెవరో?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పక్షాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి నాయకులు మేయర్‌ స్థానం గెలుచుకుంటామని ధీమా ప్రదర్శిస్తున్నప్పటికీ మంచి మెజారిటీ వస్తుందో, లేదోనని ఆందోళనలో ఉన్నారు.

రెండున్నరేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎంపీగా భరత్‌ ఐదు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే గాజువాకలో పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించారు. భీమిలిలో గంటా శ్రీనివాసరావు కూడా మంచి మెజారిటీ సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. అటువంటి విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. గూగుల్‌ డేటా సెంటర్‌ తీసుకువచ్చింది. సెమీ కండక్టర్స్‌ కంపెనీ తెచ్చింది. కాగ్నిజెంట్‌ , టీసీఎస్‌ వంటి జెయింట్‌ ఐటీ కంపెనీలు వచ్చాయి. విశాఖపట్నానికి ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం పనులు మొదలయ్యాయి. సుమారు రూ.600 కోట్లతో మధురవాడ జోన్‌లో భారీ మంచినీటి పథకం చేపట్టారు. ఇంకా వేల కోట్ల రూపాయలతో నగరంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు.

ఒకరకంగా విశాఖపట్నం తెలుగుదేశానికి కంచుకోట. ప్రతి ఎన్నికల్లోనూ ఓటర్లు అది నిరూపిస్తూ వచ్చారు. ఇప్పుడు మేయర్‌ ఎన్నికలోనూ అదే తీర్పు పునరావృతం కావలసి ఉంది. కానీ ఆ పార్టీ నాయకుల్లో అంత ధీమా కనిపించడం లేదు. గెలుస్తామని కచ్చితంగా చెబుతున్నారు కానీ మెజారిటీ గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. ఒక్క గాజువాక నియోజకవర్గంలోనూ లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని పోలింగ్‌కు ముందు కొందరు నాయకులు ధీమా వ్యక్తంచేశారు. ఇప్పుడు వారు మౌనం పాటిస్తున్నారు. సీనియర్‌ నాయకులు మాత్రం అంతా కలిసి పనిచేశామని కనీసం రెండు లక్షలకుపైగా మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. మొత్తం వార్డులు 120 ఉండగా, కూటమి 80 వరకు గెలుచుకుంటుందని చెబుతున్నారు. పోలింగ్‌కు నగర ఓటర్లు ఆసక్తి చూపకపోవడం వల్లనే తాము మెజారిటీపై గట్టిగా ఆశలు పెట్టుకోలేకపోతున్నామని అంటున్నారు.

వైసీసీలో ఏదో తెలియని ఆశ

వైసీపీ నాయకుల్లో ఏదో తెలియని ఆశ మిణుకు మిణుకుమంటూ వెలుగుతోంది. అధికార పార్టీపై ఉండే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని వారు ఆశిస్తున్నారు. అయితే కొన్ని వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులు సరిగా ప్రచారం చేయలేదని, ఇతరులపై ఆప్రభావం పడిందని చెబుతున్నారు. అయినా కార్పొరేషన్‌లో బలమైన ప్రతిపక్షంగా ఉంటామని చెబుతున్నారు.

రెబల్స్‌ గుబులు

కూటమి పార్టీల నుంచి టికెట్లు ఆశించిన మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు పలువురు స్వతంత్రులుగా పోటీకి దిగారు. గతంలో ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉండడం, ఓటర్ల నాడి తెలిసినవారు కావడంతో కొందరు గట్టి పోటీనే ఇచ్చారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య రెండు అంకెలకు చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


జీవీఎంసీలో 56.32% పోలింగ్‌

అత్యధికంగా భీమిలి జోన్‌లో 66.27 శాతం

అత్యల్పంగా నార్త్‌ జోన్‌లో 49.71 శాతం

మొత్తం ఓటర్లు 18,37,901 మంది

ఓటు హక్కు వినియోగించుకున్నవారు 10,35,154 మంది

విశాఖపట్నం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ ఎన్నికల్లో 56.32 శాతం పోలింగ్‌ నమోదైనట్టు కమిషనర్‌, ఎన్నికల అఽదనపు అధికారి కేతన్‌గార్గ్‌ తెలిపారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కూడా కొనసాగిందన్నారు. జీవీఎంసీ పరిధిలో 18,37,901 మంది ఓటర్లు ఉండగా 10,35,154 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 4,99,241 మంది, మహిళలు 5,35,880 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు. అత్యధికంగా భీమిలి జోన్‌లో 66.27 శాతం, అత్యల్పంగా నార్త్‌లో 49.71 శాతం నమోదైందన్నారు. మధురవాడ జోన్‌లో 55.07 శాతం, ఈస్ట్‌ జోన్‌లో 52.61 శాతం, వెస్ట్‌ జోన్‌లో 58.97 శాతం, గాజువాక జోన్‌లో 60.9 శాతం, అగనంపూడి జోన్‌లో 62.08 శాతం, అనకాపల్లి జోన్‌లో 65.6 శాతం, పెందుర్తి జోన్‌లో 55.12 శాతం నమోదైందని కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Nov 03 , 2026 | 01:56 AM