అనంతగిరి ఎంపీపీ పదవి ఎవరికి దక్కేనో?
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:40 PM
స్థానిక మండల పరిషత్ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఈ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు అత్యధికంగా ఉండడంతో ఆ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది.
నేడు ఎన్నిక
వైసీపీకే అధిక మెజారిటీ
ఆ పార్టీలో ఆశావహుల మధ్య వర్గ పోరు
అనంతగిరి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక మండల పరిషత్ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొంది. సోమవారం ఈ ఎన్నిక జరగనుంది. వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు అత్యధికంగా ఉండడంతో ఆ పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది. ఎంపీపీ పదవి కూడా ఆ పార్టీకే ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆ పార్టీలోనే వర్గ పోరు మొదలైంది. ఆ పార్టీకే చెందిన కొంతమంది ఆశావహులు ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు నాలుగేళ్ల పాటు వైసీపీ నుంచి అనంతగిరి సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యురాలు శెట్టి నీలవేణి ఎంపీపీగా బాధ్యతలను చేపట్టారు. అయితే ఆమెపై 11 మంది ఎంపీటీసీ సభ్యులు ప్రకటించిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆమె పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా వైస్ ఎంపీపీగా ఉన్న ఉర్మా శకుంతలకు ఆపద్ధర్మ ఎంపీపీగా గత నెలలో బాధ్యతలను అప్పగిస్తూ జడ్పీ సీఈవో ఆదేశాలు జారీ చేశారు. కాగా సోమవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి నోటిఫికేషన్ జారీ చేయడంతో అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
బీ ఫారం ఎవరికో?
ఎంపీపీ పదవి కోసం పలువురు ఆశావహులు కొద్దిరోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో చిలకలగెడ్డ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన తడబారికి మితుల గతంలో ఎంపీపీగా పోటీ చేసి శెట్టి నీలవేణిపై ఓటమి పాలయ్యారు. తాజాగా ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ఆమెతో పాటు వైస్ ఎంపీపీ-1గా ఉన్న ఉర్మా శకుంతల కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరిలో పార్టీ తరఫున బీ ఫారం ఎవరికి ఇస్తారనేది సందిగ్ధం నెలకొంది. ఎంపీపీ పదవిని ఆశిస్తున్న తడబారికి మితులకు వైసీపీ నుంచి కొంతమంది, బీజేపీ, టీడీపీ, అలాగే జీనబాడు స్వతంత్ర సభ్యురాలి మద్దతు ఉన్నట్టు సమాచారం. కాగా వైసీపీ నుంచి 9 మంది, టీడీపీ 2, బీజేపీ 1, స్వతంత్ర 2 .. మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగే ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో ఏర్పాట్లను మండల ప్రత్యేకాధికారి ఏపీసీ స్వామినాయుడు, ఎంపీడీవో ప్రభాకర్ ఆదివారం పరిశీలించారు. ఎన్నిక సమయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వామినాయుడును ప్రిసైడింగ్ అధికారిగా ప్రభుత్వం నియమించింది.