జీకేవీధి జడ్పీటీసీ టికెట్ ఎవరికో?
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:21 PM
మండల జడ్పీటీసీ టికెట్కు తీవ్ర పోటీ నెలకొంది. స్థానిక జడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్కి రిజర్వు చేశారు.
కూటమి నేతలు తీవ్ర ప్రయత్నాలు
స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్న మండల నేతలు
వైసీపీ టికెట్ రేసులో రిటైర్డు టీచరు
మొగ్గు చూపుతున్న ఎమ్మెల్యే
గూడెంకొత్తవీధి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):
మండల జడ్పీటీసీ టికెట్కు తీవ్ర పోటీ నెలకొంది. స్థానిక జడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ జనరల్కి రిజర్వు చేశారు. తాజామాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు భార్య శివరత్నం ఐదేళ్లు పాలించారు. ఆమె స్థానికేతర వ్యక్తి కావడంతో మండల ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు. చివరకు అధికారిక సమావేశాలకు సైతం హాజరైంది చాలా తక్కువ. దీంతో అన్ని రాజకీయ పార్టీల నాయకులు స్థానిక అభ్యర్థులను మాత్రమే జడ్పీటీసీ స్థానాన్ని కేటాయించాలని తీర్మానించారు. జీకేవీధి జడ్పీటీసీ స్థానాన్ని కొయ్యూరుకి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ ఆశిస్తున్నారు. టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన నుంచి అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గొర్లె వీరవెంకట్, బీజేపీ నుంచి దివంగత లోకులగాంధీ సోదరుడు లోకుల రమేశ్ భార్య రొబ్బ పుష్పలక్ష్మి ఆశిస్తున్నారు. పుష్పలక్ష్మికి టికెట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మండల జడ్పీటీసీ స్థానానికి కూటమి నాయకుల్లో తీవ్ర పోటీ నెలకొన్నది.
వైసీపీ నుంచి జడ్పీటీసీ స్థానానికి దామనాపల్లి సర్పంచ్ కుందరి రామకృష్ణ ఆది నుంచి ఆశిస్తున్నారు. అయితే రామకృష్ణ కొండదొర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో భగత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు భావిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో తూరుమామిడి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కంకిపాటి మోహనరావుకి టికెట్ కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.