Share News

డిప్యూటీ మేయర్‌ ఎవరో?

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:53 PM

జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎవరనే దానిపై సర్వత్రాచర్చ జరుగుతోంది.

డిప్యూటీ మేయర్‌ ఎవరో?

రేపు కూటమి ప్రజా ప్రతినిధులు, నేతల సమావేశం

పదవి కోసం పట్టుబడుతున్న జనసేన, బీజేపీ

బీజేపీ నుంచి పరుశరామరాజు, గంకల అప్పారావు ఆశలు

జనసేన నుంచి రేసులో మన్యాల శ్రీనివాస్‌, దల్లి గోవిందరాజులు

టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు, ఉరికూటి నారాయణరావు పోటీ

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ ఎవరనే దానిపై సర్వత్రాచర్చ జరుగుతోంది. మేయర్‌గా కూటమి తరఫున ముక్కాశ్రావణి భారీమెజారిటీతో విజయం సాధించడంతోపాటు 98 వార్డుల్లో కూటమి అభ్యర్థులే గెలిచారు. డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఈనెల 23న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో తీవ్రపోటీ నెలకొంది. ఎవరికివారు పదవి కోసం పట్టుబడుతుండడంతో కూటమి నేతలు సమావేశమై ఏకాభిప్రాయంతో ఒకరిని ఎంపికచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం సమావేశం కానున్నట్టు తెలిసింది.

జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మేయర్‌గా టీడీపీకి చెందిన ముక్కా శ్రావణి ఎన్నికయ్యారు. 120 వార్డులో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ ఎనిమిది, వైసీపీ 13, ఇండిపెండెంట్‌లు ఎనిమిది, సీపీఎం ఒకవార్డు గెలుచుకున్నాయి. మెజారిటీవార్డులను కూటమి దక్కించుకోవడంతో డిప్యూటీ మేయర్‌ పదవిని ఎవరికి కేటాయిస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. చాలామంది పోటీపడుతుండడంతో కూటమి నేతలు తలలుపట్టుకుంటున్నారు. ఈ ఎన్నిక ఈనెల 23న నిర్వహించాల్సి ఉంది. దీంతో అభ్యర్థి ఎంపికపై కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు దృష్టిసారించారు. ఆదివారం వారంతా భేటీ కావాలని భావించారు. కానీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అత్యవసర సమావేశానికి విజయవాడ వెళ్లిపోవడంతో మంగళవారానికి వాయిదా వేసినట్టు తెలిసింది. ఇదిలావుండగా మేయర్‌ పదవిని టీడీపీ దక్కించుకోవడంతో డిప్యూటీ మేయర్‌ పదవి జనసేన లేదా బీజేపీకి దక్కడం ఖాయమని చెబుతున్నారు. 26 వార్డుల్లో గెలిచిన జనసేనకే పదవి ఇవ్వాలని ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలతోపాటు కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆపార్టీకి కేటాయిస్తే ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. మేయర్‌ పదవిని కాపు సామాజికవర్గానికి ఎంపికచేసినందున, డిప్యూటీ మేయర్‌ పదవిని యాదవ సామాజికవర్గానికి కేటాయించాలని కొంతమంది నేతలు, కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. మేయర్‌ మహిళ కాబట్టి, ఈ పదవిని పురుషుడికే ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి మన్యాల శ్రీనివాస్‌కు అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. సీనియారిటీని ప్రాధాన్యంగా తీసుకుంటే గత కౌన్సిల్‌లో డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన దల్లి గోవిందరాజులకు అవకాశం దక్కుతుందంటున్నారు. మరోవైపు జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా ఉండడంతోపాటు గత కౌన్సిల్‌లో జనసేన ఫ్లోర్‌లీడర్‌గా పనిచేసిన భీశెట్టి వసంతలక్ష్మి కూడా పదవిని ఆశిస్తున్నారు.

కాగా జీవీఎంసీ ఎన్నికల సమయంలో డిప్యూటీ మేయర్‌ పదవిని బీజేపీకి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ, కార్పొరేటర్‌గా గెలిచిన పరుశురామరాజుకి అవకాశం దక్కుతుందని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. కౌన్సిల్‌లో సీనియారిటీని ప్రాధాన్యంగా తీసుకుంటే గంకల అప్పారావును ఎంపిక చేస్తారంటున్నారు.

మరోవైపు టీడీపీ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కౌన్సిల్‌లో మూడొంతులు సీట్లు గెలిచిన టీడీపీకే పదవి ఇవ్వాలని ఆపార్టీ కార్పొరేటర్లు కోరుతున్నారు. అలా జరిగితే సామాజిక సమీకరణాలను తెరపైకి తెచ్చి యాదవ సామాజికవర్గానికి న్యాయం చేయాలంటున్నారు. టీడీపీ కేటాయిస్తే సీనియర్‌ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, ఉరికూటి నారాయణరావులలో ఒకరికి అవకాశం దక్కుతుందని విశ్లేషిస్తున్నారు.

Updated Date - Nov 15 , 2026 | 11:53 PM