Share News

శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథి ఎవరో?

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:54 AM

శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించాలనే అంశంపై తర్జనభర్జన పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు చివరికి ఆ విషయం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌కు వదిలిపెట్టాలని నిర్ణయించారు.

శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథి ఎవరో?

బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించిన ఏయూ అధికారులు

ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిల్లో ఎవరో ఒకరిని తీసుకువచ్చేందుకు యత్నం

ఉత్సవాలకు దేశ, విదేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారిని ఆహ్వానించాలని అధికారులకు మంత్రి ఆదేశం

విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి):

శతాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరిని ఆహ్వానించాలనే అంశంపై తర్జనభర్జన పడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు చివరికి ఆ విషయం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌కు వదిలిపెట్టాలని నిర్ణయించారు. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన అతికొద్ది విద్యా సంస్థల్లో ఏయూ ఒకటి. ఈ నేపథ్యంలో ప్రముఖులను ఆహ్వానించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. నాలుగు రోజుల కిందట మంత్రి నారా లోకేష్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయమై వర్సిటీ అధికారులు చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న పలువురు వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేయగా, వర్సిటీ అధికారులు మాత్రం ముఖ్య అతిథిని ఆహ్వానించే బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు వదిలేసినట్టు తెలిసింది. ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిల్లో ఒకరిని ముఖ్య అతిథిగా తీసుకువస్తే జాతీయ స్థాయిలో వర్సిటీకి మరింత గుర్తింపు లభిస్తుందన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే, వారి షెడ్యూల్‌ను బట్టి రావడం, రాకపోవడం ఉంటుందని, ప్రయత్నిద్దామని చెప్పినట్టు తెలిసింది. అలాగే, శతాబ్ది వేడుకలకు దేశ, విదేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారిని ఆహ్వానించాలని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలిసింది. కీలక రంగాల్లో ముఖ్యమైన స్థానాల్లో పనిచేసిన వారిని సన్మానించాలని, పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ను శతాబ్ది వేడుకల్లో భాగస్వాములను చేయడంతోపాటు విదేశాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారిని వేడుకలకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.

సమావేశంలో తొలుత వందేళ్ల వేడుకల్లో భాగంగా వర్సిటీలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కీలక ప్రాజెక్టులకు సంబంధించి వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సెంటినరీ ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.75 కోట్లతో పనులు చేస్తున్నట్టు ఆయన వివరించారు. ఇందులో గర్ల్స్‌, బాయ్స్‌ హాస్టల్స్‌తోపాటు మెగా మెస్‌ నిర్మాణం ఉన్నాయన్నారు.

వారంపాటు వేడుకలు

శతాబ్ది వేడుకలను ఎన్ని రోజులపాటు నిర్వహించాలనే అంశంపై చర్చ జరిగింది. వారం రోజులపాటు నిర్వహించాలని అధికారులకు మంత్రి లోకేశ్‌ సూచించారు. క్యాంపస్‌లోని వివిధ విభాగాలతో పాటు అనుబంధ కళాశాలలకు కొంత సమయాన్ని కేటాయించనున్నట్టు మంత్రికి అధికారులు వివరించారు.

Updated Date - Mar 04 , 2026 | 12:54 AM