Share News

సివిల్స్‌లో సత్తా చాటిన శ్వేత

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:05 AM

జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని కణితి కాలనీకి చెందిన గుమ్మల శ్వేత సివిల్స్‌లో 573వ ర్యాంకు సాధించారు.

సివిల్స్‌లో సత్తా చాటిన శ్వేత

కణితి అమ్మాయికి 573వ ర్యాంకు

నాలుగో ప్రయత్నంలో విజేతగా నిలిచిన వైనం

ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్‌ వైపు మొగ్గు చూపినట్టు వెల్లడి

కూర్మన్నపాలెం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని కణితి కాలనీకి చెందిన గుమ్మల శ్వేత సివిల్స్‌లో 573వ ర్యాంకు సాధించారు. శ్వేత తండ్రి రాజాబాబు ఉక్కు కర్మాగారం ఎల్‌ఎంఎం విభాగంలో జనరల్‌ ఫోర్‌మన్‌గా పనిచేస్తున్నారు. తల్లి విజయలక్ష్మి గృహిణి. ఈ దంపతుల రెండో కుమార్తె శ్వేత పదో తరగతి వరకూ స్టీల్‌ప్లాంటు డీపాల్‌ స్కూల్‌, ఇంటర్మీడియట్‌ ఉక్కునగరం శ్రీచైతన్య కళాశాలలో చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ఆ తరువాత సివిల్స్‌ లక్ష్యంగా ఢిల్లీ వెళ్లి కోచింగ్‌ తీసుకున్నారు. రెండుసార్లు ప్రిలిమ్స్‌ స్థాయిలో విఫలం కాగా, మూడో ప్రయత్నంలో మెయిన్స్‌, ఇంటర్వ్యూ వరకూ చేరారు. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. దీంతో పట్టుదలతో అవిశ్రాంతంగా శ్రమించి నాలుగో ప్రయత్నంలో తన కలను సాకారం చేసుకున్నారు.

గత ఏడాది మేలో ప్రిలిమినరీ, ఆగస్టులో మెయిన్స్‌ రాశారు. ఈ ఏడాది జనవరి 5న ఢిల్లీలో జరిగిన ఇంటర్వ్యూకు హాజరై ప్రతిభ చాటిన శ్వేతకు ఐఆర్‌ఎస్‌ వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. శ్వేత అక్క శ్రావణి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. సివిల్స్‌కు శ్వేత ఎంపికవడంపై తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతో సివిల్స్‌ వైపు మొగ్గు చూపానని, ఈ విజయం వెనుక అమ్మా, నాన్న, అక్కల ప్రోత్సాహం మరువలేనని శ్వేత తెలిపారు.

Updated Date - Mar 07 , 2026 | 01:05 AM