పంచాయతీ కార్యదర్శులపై కొరడా
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:01 AM
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లు ముందుకు సాగడం లేదు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడంలేదు. ఇందుకు సంబంధిత ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారులు భావించి, ఇంటి పన్ను వసూళ్లలో బాగా వెనుకబడిన 274 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
లక్ష్యానికి దూరంలో ఇళ్ల పన్నుల వసూళ్లు
బకాయిలతో కలిపి రూ.51.85 కోట్లు డిమాండ్
ఇంతవరకు వసూలైంది రూ.24 కోట్లు మాత్రమే
లక్ష్య సాధనలో వెనుకబడిన 274 మంది కార్యదర్శులకు నోటీసులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నుల వసూళ్లు ముందుకు సాగడం లేదు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడంలేదు. ఇందుకు సంబంధిత ఉద్యోగుల నిర్లక్ష్యమే కారణమని ఉన్నతాధికారులు భావించి, ఇంటి పన్ను వసూళ్లలో బాగా వెనుకబడిన 274 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో వున్న 646 గ్రామ పంచాయతీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.8 కోట్ల మేర ఇంటి పన్నులు బకాయిలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించి రూ.43.85 కోట్లు కలిపి మొత్తం రూ.51.85 కోట్లు వసూలు చేయాలి. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత ఏడాది జూన్ నుంచి గ్రామాల్లో ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి నూరు శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ గత నెలలో అనకాపల్లిలో నిర్వహించిన సమావేశంలో సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ విజయకృష్ణన్ సైతం పంచాయతీల్లో ఇళ్ల పన్నుల వసూళ్ల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు డీపీవో సందీప్ రోజూ మండల స్థాయిలో అధికారులతో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కానీ అధికారులు ఆశించిన స్థాయిలో పన్నుల వసూళ్లు జరగడంలేదు. ఈ నె 19వ తేదీ నాటికి రూ.24 కోట్లు (46.28 శాతం) మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా రూ.27.85 కోట్లు వసూలు చేయాల్సి వుంది. పరవాడ, దేవరాపల్లి మండలాల్లో మాత్రమే 80 శాతానికిపైగా పన్ను వసూళ్లు జరిగాయి. అనకాపల్లి, మునగపాక మండలాలు బాగా వెనుకబడి ఉన్నాయి. ఈ మండలాల్లో 30 శాతం మాత్రమే పన్నులు వసూలయ్యాయి. దీంతో పన్నుల వసూళ్లలో బాగా వెనుకబడిన 274 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గత ఏడాది జూన్ నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నపప్పటికీ లక్ష్యం మేరకు పన్నులను వసూలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. జిల్లాలోని పంచాయతీల్లో ఇళ్ల పన్నులను కనీసం 50 శాతం కూడా వసూలు చేయకపోవడాన్ని జిల్లా పంచాయతీ అధికారి సందీప్ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రస్తావించగా.. మార్చి నెలాఖరులోగా నూరు శాతం పన్ను వసూలు చేయాలని ఆయా పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు.