హౌసింగ్ అధికారులపై కొరడా
ABN , Publish Date - Jul 15 , 2026 | 12:45 AM
పేదల ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది.
క్రమశిక్షణ చర్యలకు ఆదేశం
ఇళ్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ‘రాక్‌ట్రీ’ సంస్థకు మెటీరియల్ సరఫరా, బిల్లుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు
విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):
పేదల ఇళ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. జిల్లాలో ఆరుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీచేసింది. వైసీపీ హయాంలో నగర శివారున పేదల కోసమని ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పైడివాడ అగ్రహారం, గంగవరం, నడుపూరు, గొల్లలపాలెం తదితర ప్రాంతాల్లో సుమారు 14 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలు ‘రాక్‌ట్రీ’ సంస్థకు అప్పగించారు. అయితే చేపట్టిన పనుల కంటే ఎక్కువ మెటీరియల్ కేటాయించడం, అధికంగా బిల్లులు అప్‌లోడ్ చేయడం వంటివి జరగడంతో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. ఇదే సమయంలో రాక్రీట్ సంస్థ నిర్మాణాలపై ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. విజిలెన్స్ నివేదిక మేరకు నాడు విశాఖపట్నం జిల్లాలో గృహ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా ఉన్న జి.సత్యనారాయణ, డీఈలు ఆర్.ప్రసంగరాజు, బీఆర్‌వీ ప్రసాద్, వి.రామకృష్ణ, ఏఈలు జి.గోపాలకృష్ణ, కేవీ సూర్యారావులకు ఎండీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాటికి అధికారులు వివరణ ఇచ్చారు. ఈ వివరణకు ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో ఆరుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మంగళవారం వేర్వేరు ఉత్తర్వుల్లో పేర్కొంది. పరిమితికి బిల్లులు మంజూరు, ఎక్కువ మెటీరియల్ సరఫరా, ఇలా సుమారు 30 రకాలుగా రాక్రీట్ సంస్థకు లబ్ధి చేకూర్చారని భావించిన ప్రభుత్వం ఆరుగురు అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది.
ఈస్టర్న్ సీబోర్డ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అనురాగ్ కౌశిక్
విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):
ఇండియన్ కోస్ట్ గార్డ్ తూర్పు సముద్ర తీర ప్రధాన కార్యాలయం (ఈస్టర్న్ సీబోర్డ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా అనురాగ్ కౌశిక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇప్పటివరకూ కోస్ట్‌గార్డ్ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ డైరెక్టర్ (కమ్యూనికేషన్ అండ్ సెర్చ్ అండ్ రెస్క్యూ)గా విధులు నిర్వర్తించారు. గతంలోనూ కీలక విభాగాల్లో ఆయన సేవలు అందించారు.