తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వస్తుండగా..
ABN , Publish Date - May 23 , 2026 | 11:35 PM
జిల్లాలోని కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని మినీ వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొన్న మినీ వ్యాన్
ఇద్దరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
భద్రాచలం వెళ్లి వస్తుండగా ఘటన
కశింకోట, మే 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని మినీ వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా శనివారం వేకువజాము 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. దీనికి ఎస్‌ఐ లక్ష్మణరావు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
మునగపాక మండలం అరబుపాలెం గ్రామానికి చెందిన ఆడారి కూర్మారావు అలియాస్ నాయుడు(45), మూలపేట గ్రామానికి చెందిన సూరిశెట్టి జ్యోతి (31), తన కుమార్తెలు హాసిని, గ్రీష్మ, అనకాపల్లి బవులవాడకు చెందిన దాడి పద్మ, చోడవరం మండలం గజపతినగరానికి చెందిన శరగడం అప్పలకొండ, కశింకోట గవరపేట వీధికి చెందిన మళ్ళ సరోజిలు ఒక మినీ వ్యాన్‌లో గురువారం సాయంత్రం భద్రాచలం బయలుదేరారు. వీరితో పాటు మరో ఎనిమిది మంది మరో వ్యాన్‌లో భద్రాచలం వెళ్లారు. శుక్రవారం ద్వారకా తిరుమలలో స్వామివారిని దర్శించుకుని రాత్రి 10 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు. ఒక వ్యాన్ ముందు వెళ్లిపోగా, కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారి కాళీప్రసాద్ పెట్రోలు బంకు సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ లారీని అత్యంత వేగంగా మరో వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ పక్కన కూర్చున్న సూరిశెట్టి జ్యోతి, ఆడారి కూర్మారావులు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ అధికారులు, సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతి వేగంతో కంటైనర్ లారీని ఢీకొనడంతో ముందు కూర్చున్న ఆ ఇద్దరి శరీర భాగాలు గుర్తు పట్టని విధంగా ఉన్నాయి. మృతదేహాలను 108 అంబులెన్సులో అనకాపల్లి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను మరో అంబులెన్సులో ప్రైవేటు ఆస్పత్రికి కొంత మందిని, ప్రభుత్వాస్పత్రికి మరికొంత మందిని తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మృతురాలి తల్లి దొడ్డి జయలక్ష్మి, చిన్న కుమార్తె గ్రీష్మలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. కాగా మృతురాలు సూరిశెట్టి జ్యోతి భర్త రాజు దుబాయ్‌లో ఎలక్ర్టీషియన్‌గా పని చేస్తున్నాడు. కాగా మృతుడు ఆడారి కూర్మారావుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇటీవల మృతి చెందింది. కాగా ప్రమాదానికి కారకుడైన వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.