దైవదర్శనానికి వెళుతూ తిరిగిరాని లోకాలకు..
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:33 AM
ద్విచక్ర వాహనంపై దైవదర్శనానికి వెళుతున్న ఒక యువకుడు.. ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అనకాపల్లి- ఆనందపురం ఆరు వరుసల జాతీయ రహదారిపై చిన్నయ్యపాలెం వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా చెందిన ఒక యువకుడు మృతిచెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ సింహాచలం తెలిపిన వివరాలిలా వున్నాయి.
రోడ్డు ప్రమాదంలో తాపీ మేస్త్రీ మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
సబ్బవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనంపై దైవదర్శనానికి వెళుతున్న ఒక యువకుడు.. ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అనకాపల్లి- ఆనందపురం ఆరు వరుసల జాతీయ రహదారిపై చిన్నయ్యపాలెం వద్ద బైక్‌ను లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా చెందిన ఒక యువకుడు మృతిచెందాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ సింహాచలం తెలిపిన వివరాలిలా వున్నాయి.
విజయనగరం జిల్లా రాజాంకు చెందిన పంచిరెడ్డి దుర్గారావు (26) విశాఖ జిల్లా పెందుర్తిలో తాపీ మేస్త్రీగా పని చేస్తూ ఇక్కడే నివాసం వుంటున్నాడు. ఆదివారం ఉదయం తన స్నేహితులు బల్లా బుచ్చిబాబు, బల్లా భూదేవితో కలసి అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి దర్శనం కోసం బైక్‌పై వెళుతున్నారు. జాతీయ రహదారిలో చిన్నయ్యపాలెం ఫ్లై ఓవర్‌పై ముందు వెళుతున్న లారీ ఆకస్మికంగా నెమ్మదించడంతో బైక్ వేగాన్ని అదుపుచేయలేక వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. దీంతో దుర్గారావు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బుచ్చిబాబు, భూదేవికి తీవ్రగాయాలయ్యాయి. జాతీయ రహదారిపై వెళుతున్న వారిలో ఒక వ్యక్తి 108కు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత అంబులెన్స్ రావడంతో బుచ్చిబాబు, భూదేవిలను స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మృతుడి తండ్రి పంచిరెడ్డి చిన్నంనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేశారు.