Share News

పుట్టలో పాలు పోసేందుకు వెళుతూ...

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:09 AM

సొంతూరులో నాగుల చవితి వేడుకలు జరుపుకునేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అక్కాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

పుట్టలో పాలు పోసేందుకు వెళుతూ...

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి, ఆమె సోదరికి గాయాలు

డివైడర్‌ను ఢీకొట్టిన స్కూటీ

కొమ్మాది/చోడవరం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

సొంతూరులో నాగుల చవితి వేడుకలు జరుపుకునేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన అక్కాచెల్లెళ్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెల్లెలు మృతిచెందగా, అక్కకు గాయాలయ్యాయి. నగరంలోని పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలోని లా కాలేజీ కూడలిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన కోరిబిల్లి వేణుగోపాలరావు (కిశోర్‌) విశాఖలోని నారాయణ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలతో మధురవాడ సమీపంలోని పీఎం పాలెంలో నివాసం ఉంటున్నారు. నాగుల చవితి కావడంతో స్వగ్రామం గోవాడలో కుటుంబ సభ్యులతో కలిసి పుట్టలో పాలు పోసేందుకు శుక్రవారం వేణుగోపాలరావు పెద్దకుమార్తె ఆదిత్య హర్షిణి, రెండో కుమార్తె అమృత వర్షిణి (21) ఉదయం ఆరు గంటలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం ఎండాడ లా కళాశాల కూడలి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు ఇద్దరు రోడ్డుపై పడిపోయారు. వాహనం నడుపుతున్న అమృత వర్షిణితీవ్రంగా గాయపడి, సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదిత్య హర్షిణికి గాయాలవడంతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపారు.


‘డోజ్కో’కు జనవరి 12న శంకుస్థాపన

భూమి పూజకు హాజరుకానున్న మంత్రి నారా లోకేశ్‌

మాకవరపాలెం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధి ఎరకన్నపాలెంలో డోజ్కో కంపెనీ నిర్మాణ పనులకు జనవరి 12వ తేదీన మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులతోపాటు రష్యాకు చెందిన నిర్మాణ నిపుణుల బృందం శుక్రవారం ఎరకన్నపాలెంలో కంపెనీకి కేటాయించిన భూములను పరిశీలించింది. రాచపల్లి రెవెన్యూ 737 సర్వే నంబరులో 150 ఎకరాలను ప్రభుత్వం ఈ కంపెనీకి కేటాయించిన విషయం తెలిసిందే. సుమారు రూ.1,256 కోట్ల పెట్టుబడితో ఎర్త్‌ మూవర్‌ యంత్రాలు, విడిభాగాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. మొదటి దశలో 1,400 మందికి, రెండో దశలో 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వారు తెలిపారు.


తుఫాన్‌తో అప్రమత్తం

విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

ఉత్తర కోస్తాకు తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం తుఫాన్‌ ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి లేదా 19వ తేదీ ఉదయం మచిలీపట్నం, గోపాలపూర్‌ మధ్య కాకినాడ లేదా కళింగపట్నం సమీపాన తీరం దాటనున్నది. విశాఖకు దక్షిణాన అంటే కాకినాడ, ఉత్తరాన అంటే కళింగపట్నం పరిసరాల్లో తీరం దాటుతుందని వివరించారు. లేదా బంగాళాఖాతంలో అధికపీడనం మరింత బలంగా ఉంటూ తుఫాన్‌ గమనాన్ని నియంత్రిస్తే కాకినాడ, మచిలీపట్నం పరిసరాల వైపు వెళ్లే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. కాగా తుఫాన్‌ రానున్నదనే వార్తలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వరి పైరు కొన్నిచోట్ల కోతకు సిద్ధంగా ఉండగా ఎక్కువ ప్రాంతాల్లో పొట్టదశలో ఉంది. ఉత్తరాంధ్రలో తీరం దాటితే మూడు ఉమ్మడి జిల్లాలు, పొరుగునున్న తూర్పుగోదావరి, దక్షిణ ఒడిశా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణుడొకరు హెచ్చరించారు.

Updated Date - Nov 14 , 2026 | 01:09 AM