ఎక్కడి పనులు అక్కడే
ABN , Publish Date - May 21 , 2026 | 01:04 AM
జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులకు తారు కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ మధ్య మూడున్నర నెలల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో గల్ఫ్ దేశాల నుంచి తారు దిగుమతి ఆగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా మార్చి చివరినాటికి పూర్తికావాల్సిన పనులు చాలా వరకు అసంపూర్తిగా వుండిపోయాయి. మిగిలిన పనులను సైతం కాంట్రాక్టర్లు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
రోడ్ల నిర్మాణాలపై యుద్ధ ప్రభావం
తారు కొరతతోపాటు అమాంతం పెరిగిన ధరలు
మూడు నెలల కిందట టన్ను రూ.42 వేలు
ప్రస్తుతం రూ.85 వేలకు చేరిక
బీటీ పనులు చేయలేమంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు
వర్షాలు రాకముందే పూర్తి చేయాలనే లక్ష్యానికి విఘాతం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులకు తారు కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా- ఇరాన్ మధ్య మూడున్నర నెలల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో గల్ఫ్ దేశాల నుంచి తారు దిగుమతి ఆగిపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా మార్చి చివరినాటికి పూర్తికావాల్సిన పనులు చాలా వరకు అసంపూర్తిగా వుండిపోయాయి. మిగిలిన పనులను సైతం కాంట్రాక్టర్లు తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రహదారుల నిర్వహణ, అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేయడంతో పూర్తిగా ఛిద్రమై వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల రహదారుల అభివృద్ధికి ప్రాధానం ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో రహదారులు, భవనాల శాఖ పరిధిలోని 61 రహదారుల అభివృద్ధి, నిర్వహణ పనులకు రూ.284 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.150 కోట్ల సాధారణ నిధులతో చేపట్టిన రోడ్లు 54 ఉండగా రూ.134 కోట్ల న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన ఏడు రహదారులు వున్నాయి. ఈ పనులకు మూడు నెలల క్రితమే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, వర్షాకాలం వచ్చేలోగా పూర్తి చేయాలని ఆయా కాంట్రాక్టర్లను ఆదేశించింది. దీంతో కాంట్రాక్టర్లుొలుత రాళ్లు, కంకరతో చేయాల్సిన పనులు మొదలుపెట్టారు. ఇవి పూర్తయ్యేసరికి పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరింది. గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురుతోపాటు తారు, పాలిమర్, నాఫ్తా, తదితర పెట్రోలియం ఉప ఉత్పత్తుల రవాణా నిలిచిపోయింది. ఈ ప్రభావం జిల్లాలో రహదారుల అభివృద్ధి పనులపై పడింది. తారు దిగుమతి పూర్తి తగ్గిపోవడంతో దేశీయంగా వున్న చమురు శుద్ధి కంపెనీలు తారు ధరలను విపరీతంగా పెంచేశాయి. మూడు నెలల కిందట టన్ను తారు రూ.42 వేలు ఉండగా ఇప్పుడు రూ.85 వేలకు చేరుకుంది. ఈ ధరకు తారు కొనుగోలు చేసి పనులు చేపడితే తమకు చేతి చమురు వదులుతుందని భావించిన కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులు ఆపేశారు. మరికొద్ది రోజుల్లో వర్షా కాలం మొదలవుతుంది. అటుచూస్తే పశ్చిమాసియాలో వాతావరణం ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడంలేదు. ఇప్పుడున్న ధరలకు తారు కొనుగోలు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. దీంతో అధికారులు సైతం మిన్నకుండిపోయారు. ఆర్‌అండ్‌బీతోపాటు పంచాయతీరాజ్ శాఖలో చేపట్టిన బీటీ రోడ్ల పనులు సైతం నిలిచిపోయాయి.
బీఎన్ రోడ్డులో చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి సబ్బవరం మండలం లింగాలతిరుగుడు వరకు చేపట్టిన రహదారి విస్తరణ, అభివృద్ధి పనులు అగిపోయాయి. బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట రోడ్డు నుంచి పెదమదీన మీదుగా గన్నెంపూడి వరకు రూ.1.6 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు పైతం తారు కొరత కారణంగా రెండు వారాలుగా నిలిపేశారు. ఇదే మండలం రాజాం నుంచి తురకలపూడి వరకు రోడ్డు పనులు ఆగిపోయాయి. పాయకరావుపేట పట్టణంలో చేపట్టిన మెయిన్ రోడ్డు విస్తరణ పనులను తారు కొరత కారణంగా వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్ అధికారులు ఆపేశారు. ఆయా రహదారుల్లో మెటల్ పనులు పూర్తిచేసి, తారు లేయర్ వేయకపోవడంతో రాళ్లు లేచిపోయి, దుమ్ము ధూళి ఎగిసిపడుతూ వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందున్న ధరలకు ప్రభుత్వం తారు సరఫరా చేస్తే రహదారుల పనులను కొనసాగిస్తామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తామేమీ నిర్ణయాలు తీసుకోలేమని ఆర్‌అండ్‌బీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి పనులు పునఃప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోకపోతే అసంపూర్తిగా వున్న రహదారులన్నీ వర్షాకాలంలో ఛిద్రం అయ్యే అవకాశం వుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులు ఆగిపోవడంపై ఈఈ సాంబశివరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. తారు ధరలు రెట్టింపు కావడంతో కాంట్రాక్టర్లు తాత్కాలికంగా పనులు ఆపేశారని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించామని, తదుపరి ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని వెల్లడించారు.