Share News

ఎక్కడి చెత్త అక్కడి దుకాణాల్లోనే...

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:56 AM

నగరంలో పారిశుధ్య నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ గట్టిగా దృష్టిసారించారు.

ఎక్కడి చెత్త అక్కడి దుకాణాల్లోనే...

పారిశుధ్య లోపంపై జీవీఎంసీ కమిషనర్‌ కన్నెర్ర

చినవాల్తేరులో దుకాణాల ముందున్న చెత్తను సిబ్బందితో ఎత్తించి వాటిల్లోనే వేయించిన కేతన్‌గార్గ్‌

ఇకపై ఇదే తరహా రిటర్న్‌ గిఫ్ట్‌ తప్పదని హెచ్చరిక

డస్ట్‌ బిన్‌లు ఏర్పాటుచేయకపోవడంతో రూ.పది వేలు చొప్పున జరిమానా

ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాల్సిందిగా అధికారులకు ఆదేశం

విశాఖపట్నం, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి):

నగరంలో పారిశుధ్య నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ గట్టిగా దృష్టిసారించారు. ప్రధానంగా వాణిజ్య ప్రాంతాలు, దుకాణాల వద్ద పరిశుభ్రత నిర్వహణ, డస్ట్‌బిన్‌ల ఏర్పాటుపై ఎంతగా అవగాహన కల్పించినా ఆశించిన ఫలితం కనిపించకపోవడంతో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

సోమవారం ఉదయం బీచ్‌రోడ్డు, చినవాల్తేరు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన ఆయన దుకాణాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల ముందు చెత్త కనిపించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దుకాణం ముందున్న చెత్తను పారిశుధ్య సిబ్బందితో ఎత్తించి అదే దుకాణంలోని కౌంటర్లలో వేయించారు. దుకాణం ముందు విధిగా మూడు డస్ట్‌బిన్‌లు పెట్టాలని చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంపై దుకాణదారులను ఆయన నిలదీశారు. డస్ట్‌బిన్‌లు లేకపోవడంతో వినియోగదారులు చెత్తను రోడ్లపై, ఫుట్‌పాత్‌లపై, కాలువల్లో పడేస్తున్నారన్నారు. డస్ట్‌బిన్‌లను దుకాణం ముందు ఉంచకుండా బాధ్యతారహితంగా వ్యవహరించిన వ్యాపారులకు రూ.పది వేలు చొప్పున జరిమానా విధించారు. ఇకపై దుకాణాల ముందు చెత్త కనిపిస్తే తమ సిబ్బంది ఆ చెత్తను పోగేసి తిరిగి ఆ దుకాణాల్లోనే వేస్తారని స్పష్టంచేశారు. ‘పారిశుధ్యం పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించే వారికి ఇకపై రిటర్న్‌ గిఫ్ట్‌ కింద ఇదే తరహా శిక్ష విధిస్తామని’ కమిషనర్‌ స్పష్టంచేశారు. అనంతరం అక్కడకు సమీపంలో ఫుట్‌పాత్‌ను ఆక్రమించేసి నిర్వహిస్తున్న చికెన్‌ దుకాణం వద్దకు వెళ్లారు. ఫుట్‌పాత్‌పై దుకాణం పెట్టకూడదని తెలిసి కూడా ఎలా ఆక్రమించారని దుకాణదారుడిని ప్రశ్నించారు. తక్షణం దుకాణం తొలగించి ఫుట్‌పాత్‌ను పాదచారులు నడిచేందుకు అనువుగా ఉంచకపోతే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అక్కడే ఉండి ఫుట్‌పాత్‌పై దుకాణాన్ని తొలగింపజేశారు. ఇకపై నగరంలోని అన్ని మార్కెట్‌లు, వాణిజ్యప్రాంతాలు, దుకాణాల వద్ద పరిశుభ్రత విషయంలో ఇదే తరహాలో కఠినంగా వ్యవహరించాలని ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ఆరంభమైనందున గెడ్డల్లో చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20న కురిసిన వర్షానికి పార్క్‌హోటల్‌ సమీపంలోని గెడ్డ పొంగి రోడ్డుపై ప్రవహించడానికి కారణం ఏమిటని ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. గెడ్డల్లో వ్యర్థాలు పేరుకుపోవడం, గెడ్డల ఆక్రమణ వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని అధికారులు సమాధానం ఇచ్చారు. ఇకపై గెడ్డల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు గెడ్డల్లో వ్యర్థాలు వేసేవారిని గుర్తించి జరిమానా విధించాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.

Updated Date - Jun 23 , 2026 | 12:56 AM