Share News

టిడ్కో ఇళ్లకు దారేది?

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:18 AM

పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో) ద్వారా ఫ్లాట్‌లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.

టిడ్కో ఇళ్లకు దారేది?

బురదమయంగా మారిన మట్టి రోడ్డు

లబ్ధిదారుల ఎంపిక, ఫ్లాట్‌ల కేటాయింపు పూర్తి

2న అప్పగింతకు అధికారుల సన్నాహాలు

సీసీ రోడ్డుకోసం లబ్ధిదారుల పట్టు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టిడ్కో) ద్వారా ఫ్లాట్‌లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. డ్రైనేజీ, నీటిసరఫరా పైప్‌లైన్‌ వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన అధికారులు ప్రధానమైన రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించడంతో నివాస సముదాయాలు వృథాగా మారుతున్నాయి. లబ్ధిదారుల ఎంపిక, ఫ్లాట్‌ల కేటాయింపు, బ్యాంకు లింకేజీ పూర్తవడంతో వచ్చేనెల రెండునాటికి లబ్ధిదారులకు ఫ్లాట్‌లను అందజేస్తామని అధికారులు ప్రకటించారు. కానీ రోడ్డు సదుపాయం కల్పించకుండా ఇళ్లు ఇస్తే ఏం ప్రయోజనమని లబ్ధిదారులు ప్రశ్నిస్తుండడంతో పునరాలోచనలో పడ్డారు.

టిడ్కో పథకం కింద కొమ్మాది సమీపంలోని అమరావతినగర్‌లో 384 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అందులో 184 డబుల్‌బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లు కాగా మిగిలినవి సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లు. గృహ నిర్మాణానికి సంబంధించి సివిల్‌వర్క్‌తో పాటు కార్పెంటర్‌, ప్లంబంగ్‌, ఎలక్ర్టిక్‌ పనులు చాలాకాలం కిందటే పూర్తయ్యాయి. ఆయా ఇళ్లకు లాటరీ తీసిన జీవీఎంసీ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా పోగా మిగిలిన మొత్తానికి (లబ్ధిదారుడివాటా) బ్యాంకుల నుంచి రుణం ఇప్పించే ప్రక్రియ కూడా పూర్తయింది. మొత్తం 384 మందిలో 270 మందికి బ్యాంకు రుణాలు మంజూరవగా, మిగిలినవారి సిబిల్‌స్కోర్‌ సరిగా లేకపోవడం, 60 ఏళ్ల వయసు పైబడినవారు కావడం వంటి సాంకేతిక కారణాలతో రుణాల మంజూరు పెండింగ్‌లో ఉన్నాయి. తమకు కేటాయించిన ఇళ్ల పనులతో పాటు, బ్యాంకు రుణాలు మంజూరవడంతో వీలైనంత త్వరగా గృహప్రవేశాలు చేసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవాలని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అమరావతినగర్‌ కొమ్మాదికి అతిసమీపంలో ఉండడంతో టిడ్కో గృహసముదాయంలోని ఫ్లాట్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో వారంతా గృహప్రవేశాలు చేస్తారని అధికారులు కూడా భావించారు. అయితే టిడ్కో గృహసముదాయంలోని అన్నిబ్లాక్‌లకు సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించినప్పటికీ అమరావతినగర్‌ మెయిన్‌రోడ్డు నుంచి టిడ్కో గృహసముదాయం వరకు అర కిలోమీటరు దూరం మట్టిరోడ్డుగానే ఉండడంతో గృహప్రవేశాలకు ఆటంకంగా మారింది. చిన్నపాటి వర్షంపడినా ఈ రోడ్డు బురదమయమవుతోంది. వాహన రాకపోకలు సంగతి పక్కనపెడితే కనీసం మనిషులు నడిచి వెళ్లడానికి కూడా వీలులేని పరిస్థితి. దీంతో మట్టిరోడ్డు స్థానంలో తారు లేదా సిమెంట్‌ రోడ్డు నిర్మించాలని లబ్ధిదారులు పలుమార్లు జీవీఎంసీ అధికారులను కోరారు.

గత ప్రభుత్వం లబ్ధిదారుల గోడును పట్టించుకోకపోవడంతో రోడ్డు నిర్మాణం జరగలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం జీవీఎంసీ పరిధిలోని టిడ్కో గృహసముదాయాల్లో లబ్ధిదారులు నివాసం ఉండేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టింది. గృహ ప్రవేశాలు జరగకుండా ఉండిపోయిన సముదాయాల్లో పెండింగ్‌ పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన పెండింగ్‌లో ఉండడంతో ఆయా పనులను అధికారులు పూర్తిచేశారు. దీంతో వచ్చేనెల రెండున కొన్ని సముదాయాల్లో ఫ్లాట్‌లను లబ్ధిదారులకు అందజేసి గృహప్రవేశాలు జరిపిస్తామని ప్రకటించారు. కానీ అమరావతినగర్‌ టిడ్కో సముదాయంలో గృహప్రవేశాలకు ప్రధాన అడ్డంకిగా మారిన రోడ్డు నిర్మాణాన్ని విస్మరించారు. రోడ్డు నిర్మిస్తేనే గృహప్రవేశాలు చేస్తామని లబ్ధిదారులు చెబుతున్నారని జీవీఎంసీ యూసీడీ అధికారులు కూడా పేర్కొంటున్నారు.

రోడ్డు నిర్మించాల్సిన బాధ్యత టిడ్కో అధికారులదేనని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతుండగా, జీవీఎంసీదేనని టిడ్కో అధికారులు తప్పించుకుంటున్నారని యూసీడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకు రుణాలు మంజూరైపోవడంతో నెలనెలా వాయిదాలు కట్టమని ఒత్తిడి వస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాజాగా కురిసిన వర్షాలతో అమరావతినగర్‌ టిడ్కో సముదాయానికి వెళ్లే మట్టిరోడ్డు బురదమయం కావడంతో లబ్ధిదారులతో గృహప్రవేశాలు జరిపించడం అసాధ్యమని, వాయిదా వేయాలని కోరామని యూసీడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:18 AM