ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ?
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:39 PM
మండలంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అంతంత మాత్రంగానే అమలవుతోంది. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 120 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు, సామగ్రిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు కలెక్టర్ దినేశ్‌కుమార్ ప్రకటించారు.
ఏడాది క్రితం పూర్తిగా నిషేధిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించినా ఇప్పటికీ అమలుకాని వైనం
దుకాణాలు, మార్కెట్లలో విచ్చలవిడిగా వాడకం
పట్టించుకోని జిల్లా యంత్రాంగం
చింతపల్లి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అంతంత మాత్రంగానే అమలవుతోంది. గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 120 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు, సామగ్రిని పూర్తిగా నిషేధిస్తున్నట్టు కలెక్టర్ దినేశ్‌కుమార్ ప్రకటించారు. ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కాగా అమలుచేయాలని డీపీవో, పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో చింతపల్లి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శులు దుకాణ యజమానుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ నిషేధంపై ఆదేశాలను వివరించారు. అయితే గిరిజన ప్రాంతంలో ప్లాస్టిక్ నిషేధించి ఏడాది కావస్తున్నా ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పర్యాటక ప్రాంతాలైన లంబసింగి, తాజంగి, చెరువులవేనం ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా కిరాణా, అల్పాహారం, కూరగాయల దుకాణాల్లో పాలిథిన్ కవర్లు విరివిగా వినియోగిస్తున్నారు. వివిధ దుకాణాలకు వెళ్లే వినియోగదారులు వారి వెంట నార సంచులను (జూట్ బ్యాగ్) తీసుకువెళ్లడం లేదు. దుకాణ యజమానులు ఇచ్చే పాలిథిన్ కవర్లపైనే ఆధారపడుతున్నారు. ప్లాస్టిక్ గ్లాస్‌లు, ప్లేట్లు హోటళ్లలో అధికంగా ఉపయోగిస్తున్నారు. అలాగే మందుబాబులు మద్యం తాగడానికి ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాస్‌లను ఎక్కడబడితే అక్కడ పారేస్తున్నారు. విందు, వినోద కార్యక్రమాల్లో వినియోగించిన ప్లాస్టిక్ గ్లాస్, కప్, పేట్లు గ్రామ శివార్లలో పడేస్తున్నారు. దీంతో పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని అనారోగ్యానికి గురవుతున్నాయి. పంట పొలాలు, కాఫీతోటలు, గ్రామ శివార్లలోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. కాగా ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకున్న దాఖలాలు కూడా కనిపించడంలేదు. ఇప్పటికైనా ప్లాస్టిక్ వినియోగంపై అధికార యంత్రంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పర్యావరణ పరిరక్షణ ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.