మత్స్యకారుల భద్రతకు భరోసా ఏదీ?
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:48 AM
బైక్, కారు, లారీ...ఇలా వాహనం ఏదైనా నడపాలంటే లైసెన్స్ ఉండాలి.
బోటు యజమానుల ఇష్టారాజ్యం
నిబంధనలు పాటించని వారే అధికం
లైసెన్స్, రిజిస్ట్రేషన్లు వంటివి సరిగా లేకుండానే చేపల వేటకు..
తనిఖీలు చేపట్టకుండా అడ్డుకుంటున్న సంఘాల నాయకులు
బీమా సదుపాయం నిల్
ప్రమాదం జరిగితే పరిహారం కోసం పాట్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
బైక్, కారు, లారీ...ఇలా వాహనం ఏదైనా నడపాలంటే లైసెన్స్ ఉండాలి. టూ వీలర్ అయితే హెల్మెట్ ధరించాలి. కారు నడిపితే సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ప్రమాదం జరిగితే ఆర్థికంగా నష్టపోకుండా తప్పనిసరిగా బీమా తీసుకోవాలి. వీటిలో ఏది లేకపోయినా అధికారులు జరిమానా వేస్తారు. ఇందుకోసం రహదారులపై ఎక్కడికక్కడ పోలీసులు కాపు కాసి తనిఖీలు చేస్తుంటారు. మరి సముద్రంలో చేపల వేటకు వెళ్లే సమయంలో బోటు యజమానులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, వాటిని పాటిస్తున్నారా?, లేదా?...అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గంగవరం పోర్టు సమీపాన ఈ నెల మొదటి వారంలో బోటు మునిగిపోయి ఆరుగురు మత్స్యకారులు మరణించారు. బోటు యజమాని కారి చిన్నా ఒక్కడే బతికి బయటపడ్డాడు. ప్రభుత్వం తనకు ఏమీ సాయం చేయలేదని, చనిపోయిన కుటుంబాలకే రూ.10 లక్షల నష్టపరిహారం ఇచ్చిందని వాపోతున్నాడు. నిన్నటికి నిన్న ఓ బోటు బ్రేక్ వాటర్స్ సమీపాన బోల్తాపడింది. ఇద్దరు గాయపడ్డారు. తమకు ప్రభుత్వం సాయం చేయాలని వారు కోరుతున్నారు. బోటుకు రూ.2 లక్షలు, వలకు రూ.2.5 లక్షల నష్టం జరిగిందని అంటున్నారు.
నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఫిషింగ్ రెగ్యులేషన్ (ఏపీఎంఎఫ్‌ఆర్) చట్టం ప్రకారం సముద్రంలో చేపల వేటకు వెళ్లే ప్రతి బోటు తప్పనిసరిగా మత్స్య శాఖ అధికారుల వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లైసెన్స్ తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25 మాత్రమే. లైసెన్స్ ఫీజు రూ.50. నిబంధనల ప్రకారం రెన్యువల్ చేయించుకోవాలి. వేటకు వెళ్లే ప్రతిసారి ముందుగా సమీపంలోని సాగరమిత్రకు సమాచారం ఇవ్వాలి. ఏ బోటు వేటకు వెళుతుంది?, ఎంతమంది (పేర్లతో సహా) వెళుతున్నారు?, ఏ దిక్కున వెళుతున్నారు?, ఎంత ఆయిల్ పోయించుకొని వెళుతున్నారు?...అనే వివరాలు అందించాలి.
వేటకు వెళ్లే బోటు ఫిట్‌గా ఉందని సర్టిఫై చేయించుకోవాలి. ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సర్వేయర్ సంయుక్తంగా బోటును తనిఖీ చేసి, బాగుందని, వేటకు అనువైనదని, అందులో అన్నీ ఉన్నాయని సర్టిఫై చేస్తేనే రెన్యువల్ చేస్తారు. అప్పుడే అది వేటకు వెళ్లాలి. ప్రతి బోటులో ఎంత మంది ఉంటే అంతమందికి ప్రమాదంలో ఉపకరించే లైఫ్ జాకెట్లు, అగ్ని ప్రమాదం సంభవిస్తే నివారించడానికి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్‌మెంట్, బీమా పత్రాలు ఉండాలి.
విశాఖపట్నంలో లక్ష రూపాయల నుంచి రూ.50 లక్షల వరకు ఖరీదు చేసే బోట్లు చేపలవేటకు వెళుతున్నాయి. చాలామంది పాత బోట్లను కేరళ, తమిళనాడు ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ వేటకు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించడం లేదు. రోడ్లపై వాహనాలను తనిఖీ చేసినట్టు హార్బర్‌లో బోట్లను ఎవరూ తనిఖీ చేయడం లేదు. అక్కడ కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. సంఘాల నాయకులు తనిఖీలు జరగకుండా అడ్డుకుంటున్నారు. తోటి మత్స్యకారులకు ప్రాణాపాయం అని తెలిసినా అధికారులకు సహకరించడం లేదు. ఈత వచ్చునని, గంగమ్మ ఒడిలో పెరిగామని, ఏ నష్టం జరగదని సమర్థించుకుంటున్నారు. బీమా చేయించుకున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కంపెనీయే నష్టపరిహారం ఇస్తుంది. ఆ దిశగా కూడా వారికి హితబోధ చేయడం లేదు. ఇకనైనా బోటు యజమానులు నిబంధనలు పాటించేలా చూడాలి. మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు లేకుండా, బీమా చేయకుండా సముద్రంలోకి పంపించే బోట్ల యజమానులపై క్రిమినల్ కేసులు పెడితే ప్రమాదాలూ తగ్గుముఖం పడతాయి. ప్రాణనష్టం తగ్గుతుంది.
బోటు ఖరీదు రూ.లక్ష అయినా రూ.1.2 లక్ష సాయం
మత్స్యకారుల పట్ల కూటమి ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తోంది. లక్ష రూపాయల ఖరీదు చేసే బోటు అయినా సరే చేపల వేట నిషేధ సమయంలో బోటుకు ఆరుగురికి ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున రూ.1.2 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది.